తెలంగాణ బిల్లుపై 13 సవరణలు కోరిన కేసీఆర్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ నేతల బృందం మంగళవారం ఉదయం ప్రధానికి కలిసింది. భేటీ అనంతరం కేసీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రధానితో భేటీలో టీ-బిల్లులో 13 సవరణలు చేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు తెలిపారు. బిల్లులో చేసిన సవరణనలు ప్రధానికి అందించామని, తమ అభ్యర్థనను ప్రధానికి లిఖితపూర్వకంగా తెలియ చేశామన్నారు. ఈ సమావేశాల్లోనే టీ.బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు.
హైదరాబాద్ పై ఆంక్షలు పెట్టొద్దని, ఆర్థిక పరమైన అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని కోరామని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రికి తెలంగాణ ప్రజల అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడం జరిగిందని - ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని స్పష్టం కేసీఆర్ చేశారు. ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రంతో వస్తానన్న తన మాట వాస్తవం కాబోతుందని ఆయన అన్నారు.బీజేపీ తీరుపై బీఏసీ సమావేశం అనంతరం మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు. కాగా తెలంగాణ బిల్లును ముందుకు తీసుకు వెళుతున్నందుకు ప్రధానికి ఈసందర్భంగా కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.