తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది: ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ బిల్లుకు ఇతర పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని, ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుతో పాటు అవినీతి నిరోధక బిల్లు, మతహింస నిరోధక బిల్లు వంటి ముఖ్యమైన వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయిన నేపథ్యంలో మంగళవారం మన్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం వాడివేడిగా సాగింది. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నాయకులే ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ విమర్శించారు. ఇక తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇదే రోజున సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వివిధ పార్టీ నాయకులు తెలంగాణ అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా విడిపోయి హస్తినలో మంత్రాంగం నడుపుతున్నారు.