
ఇటు సింధు సంతోషం.. అటు జైశా విషాదం
సంతోష సమయాల్లో విషాదాన్ని ఎవ్వరూ కోరుకోరు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ పరిస్థితి తలెత్తింది. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను జాతి ఘనంగా సన్మానించుకుంటున్న రోజే.. అదే ఒలింపిక్స్ లో పాల్గొని.. కనీసం గుక్కెడు మంచినీళ్లకు దొరక్క తీవ్ర అస్వస్థతకు గురైన అథ్లెట్ ఓ.పి. జైశా విషాదగాథ వెలుగులోకి వచ్చింది. ప్రఖ్యాత వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాలివి..
రియో ఒలింపిక్స్ లో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన జైశా.. తనకు కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కులేకుండా పోయిందని మీడియాకు తెలిపింది. 42 కిలోమీటర్ల ర్యాలీలో ప్రతి 8 కిలోమీటర్లకు ఒకచోట నిర్వాహకులు ఏర్పాటుచేసిన వాటర్ బాటిల్స్ లభిస్తాయి. ఇవి కాకుండా అథ్లెట్లు ప్రాతినిథ్యం వహిస్తోన్న దేశాలు సొంతగా ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒక చోట రన్నర్లకు మంచినీళ్లు అందించే వీలుంటుంది.
'గొంతు తడారిపోతున్నా పరుగు ఆపలేదు. ఎక్కడన్నా త్రివర్ణ పతాకం కనబడకపోదా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశా. మన జెండా పట్టుకుని నాకు నీళ్లిచ్చేవాళ్లు ఎక్కడా కనబడలేదు. దీంతో 8 కిలోమీటర్లకు ఒకసారి ఒలింపిక్ నిర్వహకులు ఏర్పాటుచేసిన నీళ్ల మాత్రమే తాగాల్సివచ్చింది'అని విలపించింది జైశా.
157 మంది రన్నర్లు పాల్గొన్న మారథాన్ లో 89 స్థానంలో రేసు పూర్తిచేసిన జైశా.. ఎండ్ లైన్ దాటగానే కుప్పకూలి పడిపోయింది. వెంటనే ఆమెను తాత్కాలిక క్లినిక్ కు తరలించారు. ఆమె అస్వస్థతకు గురైన సంగతి కనీసం మనవాళ్లకు తెలియదట! దాదాపు మూడు గంటల తర్వాతగానీ ఆసుపత్రికి చేరుకున్న భారత అధికారులు జైశాను స్వస్థలం (కేరళ)కు పంపించే ఏర్పాటుచేశారు. అయితే బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న జైశా మరీ నీరంగా కనిపించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
'ఇది నాకు రెండో జన్మలాంటింది. నీళ్లు తాగకుండా మారథాన్ పరుగెత్తడం చావును కొనితెచ్చుకున్నట్లే. కానీ ఏం చేస్తా! నిజానికి నేను లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ని. కోచ్ బలవంతం మేరకు మారథాన్ లో పరుగెత్తాల్సి వచ్చింది'అని జైశా చెప్పింది. ఆమెతో పాటు లాంగ్ డిస్టెన్స్ పోటీల్లో పాల్గొన్న మరో అథ్లెట్ సుధా సింగ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు జికా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్న డాక్టర్లు ఆమేరకు నమూనాలను పరీక్షిస్తున్నారు. ఫలితం తెలియాల్సిఉంది. వీళ్లిద్దరే కాక భారత్ తరఫున ప్రాతిథ్యం వహించిన ఎంతో మంది అథ్లెట్లు, క్రీడాకారులు గాయాలపాలయ్యారు. కాస్తోకూస్తో పేరు, డబ్బున్నవాళ్లు సర్జరీలు చేయించుకుంటున్నారు కానీ జైశా లాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా?
ఈ వ్యవహారంపై క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందిస్తూ.. అథ్లెట్ల అస్వస్థతకు సంబంధించిన విషయాలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) పర్యవేక్షిస్తుందని అన్నారు. జైశా విషయంలో అధికారులతో మాట్లాడతానని చెప్పారు.