75 బిలియన్ డాలర్లకు ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్!
2014-15లో ఏపీ, తెలంగాణలో 3.5 బిలియన్ డాలర్లు
2025కల్లా 50 బి. డాలర్లకు చేరే చాన్స్
డెరైక్ట్ సెల్లింగ్‌పై ఫిక్కీ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ కంపెనీలేవైనా తమ తొలి ఉత్పత్తులను దక్షిణాదిలోనే ప్రారంభిస్తాయి. అందుకే దేశంలో ఏటా ప్రత్యక్ష అమ్మకాల వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 2009-10లో 41 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్ 2014-15 నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరిందని ఫిక్కీ, కేపీఎంజీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో తేలింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో ‘ప్రత్యక్ష అమ్మకాలు- సవాళ్లు’ అనే అంశంపై ఫిక్కీ నివేదికను రూపొందించింది. ఇందులో భాగంగా ‘ప్రత్యక్ష అమ్మకాలు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ’ రిపోర్ట్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ రిటైల్ హెడ్ శిల్పా గుప్తా, ఫిక్కీ తెలంగాణ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఎండీ సఫిర్ అదేని, సివిల్ సప్లయర్స్ కమిషనర్ రజత్ కుమార్, ఇంటర్నల్ ట్రేడ్ డెరైక్టర్ జాకీర్ హుస్సేన్‌లు పాల్గొన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలివి..
{పత్యక్ష అమ్మకాలకు, కంపెనీలకు ఆమ్‌వే, అవాన్, హెర్బాలైఫ్, ఓరీఫ్లేమ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఉత్పత్తులైన హెల్త్, బ్యూటీ ఉత్పత్తులు, హోమ్ నీడ్స్, కాస్మొటిక్స్, కిచెన్ వేర్స్ వం టివి ఉదాహరణ. ప్రస్తుతం ప్రపంచంలో ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్ 180 బిలియన్ డాలర్లుగా ఉంది. 2010లో ప్రత్యక్ష అమ్మకాల ఉద్యోగుల సంఖ్య 79 మిలియన్లుగా ఉంటే అది 2014 నాటికి 100 మిలియన్లకు చేరింది. ఇందులో మహిళల వాటా 75% మేర ఉంది. ఐదేళ్లుగా ఏటా 8.5 శాతం వృద్ధి రేటను కనబరుస్తుంది.
ఆసియా పసిఫిక్ ప్రాం తంలో ప్రత్యక్ష అమ్మకాలతో 5.1 కోట్ల మంది ఉపాధిని పొందుతున్నారు.2013-14లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్ 3.3 నుంచి 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. వ్యాపారులు 29 మిలియన్ల మంది ఉన్నారు. 2025 నాటికి ఇది 50 బిలియన్లకు చేరుతుంది. ప్రత్యక్ష అమ్మకాలకు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి ఆర్బన్ ప్రాంతాలు బలాన్నిస్తున్నాయి. మొత్తం మార్కెట్లో 29 శాతం అంటే 22 బిలియన్ డాలర్లతో ఉత్తరాది ప్రాంతం తొలిస్థానంలో నిలవగా.. 25% వాటా.. 19 బిలియన్ డాలర్లతో దక్షిణాది ప్రాంతం రెండో స్థానంలో నిలిచింది.