పోలీసుల అదుపులో నిందితుడు యాంగ్ జింగ్పె
చైనాలో ఘాతుకం
Published Mon, Oct 3 2016 6:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
బీజింగ్: చైనా వర్తమాన చరిత్రలో తీవ్ర ఘాతుకంగా పరిగణిస్తోన్న సంఘటన ఆ దేశ నైరుతి రాష్ట్రమైన యునాన్లో చోటుచేసుకుంది. చెడు అలవాట్లకు బానిస అయిన ఓ కొడుకు అప్పులు తీర్చడానికి నిరాకరించిన తల్లిదండ్రుల్ని దారుణంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఎక్కడ నేరం బయటపెతారోనని చుట్టుపక్కల ఇళ్లలోని 17 మందిని కూడా కిరాతకంగా చంపేశాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ దురాగతంపై యునాన్ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం..
యునాన్ ఫ్రావిన్స్ రాజధాని కున్ మింగ్ లో చిన్నపాటి ఉద్యోగం చేస్తోన్న యాంగ్ జింగ్ పె(27) అనే యువకుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. దీంతో దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులుచేశాడు. అవి తీర్చలేని స్థితిలో.. డబ్బు కోసం బుధవారం సొంత ఊరికి వెళ్లాడు. అప్పులు తీర్చమని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. వాళ్లు ఎంతకీ అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడై అమ్మానాన్నలి దారుణంగా చంపేశాడు. పక్కింటివాళ్లెవరైనా తన వివరాలు చెబుతారేమోననే సందేహంలో వాళ్లను కూడా ఒక్కొక్కరిగా చంపేశాడు. అలా యాంగ్ జింగ్ పె మొత్తం 19 మందిని కిరాతకంగా చంపాడు. వారిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. హత్యలు చేసి ఏమీ తెలియనివాడిలా కున్మింగ్కు వెళ్లిపోయాడు.
ఇప్పటికే చైనాలో పలు సామూహిక హత్యోదంతాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ మారణకాండకు సంబంధించిన వార్తలు కూడా దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. రంగంలోకి దిగిన పోలీసులు యాంగ్ జింగ్పెను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రులు సహా మొత్తం 19 హత్యలు తానే చేసినట్లు యాంగ్ ఒప్పుకున్నాడు. ప్రజా భద్రత శాఖ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసు అతి త్వరలోనే కోర్టుకు చేరుతుంది. నిందితుడికి ఎక్కువలో ఎక్కువ మరణశిక్ష విధించే అవకాశాలున్నాయి.
Advertisement
Advertisement