ఫార్చూన్ 50 వ్యాపారవేత్తల్లో.. ఇద్దరు భారతీయులు
న్యూయార్క్: ఈ ఏడాదికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ టాప్ 50 వ్యాపారవేత్తల్లో ఇద్దరు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, వర్క్‌డే సహ-సీఈవో అనిల్ భూశ్రీ ఇందులో ఉన్నారు. బంగా 15వ స్థానాన్ని, భూశ్రీ 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. క్యాష్‌లెస్, మొబైల్ లావాదేవీలు పెరుగుతుండటం మాస్టర్‌కార్డ్ వ్యాపారం పెరగడానికి దోహదపడుతున్నాయని, ప్రస్తుతం 735 డాలర్లుగా ఉన్న షేరు ధర 1,000 డాలర్లకు కూడా ఎగిసే అవకాశం ఉందని ఫార్చూన్ పేర్కొంది. ఇక, భూశ్రీ సహ-సీఈవోగా వ్యవహరిస్తున్న వర్క్‌డే సంస్థ క్లౌడ్ ఆధారిత ఆర్థిక సేవలు, మానవ వనరులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సర్వీసులు అందిస్తోంది. 2013లో వర్క్‌డే అమ్మకాలు భారీగా పెరగడంతో పాటు షేరు ధర .. పోటీ సంస్థ ఒరాకిల్‌ను మించి ఎగిసింది. అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వారికి ఈ జాబితాలో చోటు దక్కింది.
ఎలక్ట్రిక్ కార్లు తయారుచేసే టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ..ఫార్చూన్ 50 జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిల్చారు. విప్లవాత్మకమైన చర్యలతో ఆటోమొబైల్, ఇంధన రంగాల్లో ఇతర సంస్థలకు మస్క్ సవాల్ విసురుతున్నారని ఫార్చూన్ పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్ గురు, బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్ వారెన్ బఫెట్ రన్నరప్‌గా నిల్చారు. మరోవైపు, వాషింగ్టన్ పోస్ట్ పత్రికను కొనుగోలు చేయడం తదితర సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆరో స్థానంలో ఉన్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ 8వ స్థానం దక్కించుకున్నారు. వివిధ విభాగాలకు సంబంధించి బెస్ట్ పురస్కారాలను కూడా ఫార్చూన్ ప్రకటించింది. దీని ప్రకారం బెస్ట్ న్యూ ఓనర్‌గా బెజోస్ నిలవగా, బెస్ట్ టర్న్‌ఎరౌండ్ సంస్థగా నెట్‌ఫ్లిక్స్ నిల్చింది. ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా హార్వర్డ్, అత్యధిక పర్యాటకులు సందర్శించే బెస్ట్ సిటీగా బ్యాంకాక్ ఉన్నాయి.