వైద్య మండలికి మళ్లీ జీవం
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైద్య మండలి (ఎంసీఐ) పూర్తిస్థాయి కమిటీకి కేంద్రం జీవం పోసింది. సంస్థ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరిస్తూ కేంద్రం బుధవారం మొత్తం 68 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. కొత్త కమిటీలో రాష్ట్రం నుంచి అయిదుగురికి స్థానం లభించడం విశేషం.ఎంసీఐ (సవరణ) రెండో ఆర్డినెన్స్, 2013లోని నిబంధనలను అనుసరించి... కొత్త కమిటీ పునర్నియామకంతో బోర్డ్ ఆఫ్ గవర్నర్లకు ఇచ్చిన అధికారాలు, విధులు రద్దయ్యాయని, మొత్తంగా బోర్డ్ ఆఫ్ గవర్నర్లనే రద్దుచేశామని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రైవేట్ కళాశాలలకు గుర్తింపు ఇచ్చే నిమిత్తం ముడుపులు స్వీకరించినందుకు 2010లో ఎంసీఐ అధ్యక్షుడిని సీబీఐ అరెస్ట్ చేయడంతో యావత్ కమిటీ రద్దయ్యింది.
కొత్త కమిటీలో 23 మంది రాష్ట్రాలతో సంప్రదించి కేంద్రం నామినేట్ చేసిన సభ్యులు కాగా మరో 29 మంది యూనివర్సిటీలు, ఆరోగ్యశాస్త్రాల వర్సిటీల నుంచి ఎన్నికైన సభ్యులున్నారు. ఒకరు డామన్-డయ్యూ నుంచి కేంద్రం నామినేట్ చేసిన సభ్యుడు కాగా ఏడుగురు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రిజిస్టర్డ్ మెడికల్ గ్రాడ్యుయేట్లు. 8 మంది కేంద్రం స్వయంగా నామినేట్‌చేసిన సభ్యులు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్, రాజమండ్రి జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గన్ని భాస్కరరావు, విశాఖపట్నం ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో బోధకుడైన డాక్టర్ పి.గుణశేఖర్, వైద్య విద్య సంచాలకుడు (అకడమిక్) డాక్టర్ కాకొల్లు వెంకటేశ్, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ కె.రమేశ్‌రెడ్డికి సభ్యులుగా అవకాశం దక్కింది. త్వరలోనే ఆఫీస్‌బేరర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఉన్నతాధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రెండేళ్లకు మించి పదవిలో కొనసాగరు. ఇతర సభ్యులు నాలుగేళ్లపాటు పదవిలో ఉంటారు.