
రూపాయి పడినా..పోర్ట్‌ఫోలియో పదిలం
కొన్నాళ్లుగా రికార్డు స్థాయిల్లో క్షీణించిన రూపాయి మారకం విలువ ఇన్వెస్టర్లను బెంబేలెత్తించింది.
కొన్నాళ్లుగా రికార్డు స్థాయిల్లో క్షీణించిన రూపాయి మారకం విలువ ఇన్వెస్టర్లను బెంబేలెత్తించింది. ఈక్విటీ, డెట్ మార్కెట్లు కుప్పకూలుతుంటే.. సగటు మదుపుదారుల పోర్ట్‌ఫోలియో ఛిన్నాభిన్నమైంది. ఇప్పుడిప్పుడే రూపాయి కాస్త కోలుకుంటున్నప్పటికీ .. మరెప్పుడైనా మళ్లీ ఇలా జరిగే అవకాశమూ ఉండొచ్చు. ఇలా రూపాయి డౌన్ అయినప్పుడు లేదా అయ్యే సంకేతాలు కనిపిస్తున్నప్పుడూ.. పోర్ట్‌ఫోలియో కరిగిపోకుండా చూసుకునేందుకు అనువైన సాధనాలు కొన్ని ఉన్నాయి.
ఎగుమతి ఆధారిత కంపెనీ షేర్లలో పెట్టుబడులు..
సాధారణంగా రూపాయి పతనమైతే.. ఎగుమతి ఆధారిత కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే.. వాటికి డాలర్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఇక్కడ రూపాయల్లోకి మార్చుకుంటే ..మార్జిన్లు మరింత పెరుగుతాయి. దీంతో వాటి షేరు ధరా పెరుగుతుంది. ఇలాంటి వాటిలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఫార్మా కంపెనీల షేర్లు ముందు వరుసలో ఉంటాయి. రూపాయి గనుక 1 శాతం క్షీణిస్తే.. వీటి నిర్వహణ మార్జిన్లు 0.3-0.5% దాకా మెరుగవుతాయి. అయితే, ఇలాంటి స్టాక్స్‌కి మరీ ఎక్కువగా కూడా కేటాయించకపోవడం మంచిది. ఎందుకంటే రూపాయి విలువ భారీగా పెరిగిపోతే.. అప్పుడు వీటికి వచ్చే ప్రయోజనాలూ తగ్గొచ్చు. ఫలితంగా మీ పెట్టుబడిపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చు.
పసిడి...: రూపాయి పతనమైతే పెరిగే వాటిల్లో బంగారం కూడా ఉంటుంది. భారత్ బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ రూపాయి గణనీయంగా పడితే ఆ ప్రభావంతో దేశీయంగా పసిడి రేటూ పెరుగుతుంది. ఉదాహరణకు, ఇటీవల అంతర్జాతీయంగా బంగారం రేటు సుమారు 17% మేర పెరగ్గా.. రూపాయి క్షీణత ప్రభావంతో దేశీయంగా దాదాపు 22% పెరిగింది. దిగుమతులపై పరిమితులు.. విధిస్తూ సుంకాలు పెంచడం వగైరా అంశాలు కూడా పసిడి పెరుగుదలకు దారి తీశాయి. కనుక.. కరిగే రూపాయి ప్రభావం నుంచి పోర్ట్‌ఫోలియోను కాపాడుకునేందుకు పసిడిని పరిగణనలోకి తీసుకోవచ్చు.
విదేశీ ఫండ్లు..
ప్రస్తుతం అంతర్జాతీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ పథకాల్లో రూపాయి మారకంలో ఇన్వెస్ట్ చేస్తే..అవి డాలర్ల రూపంలో విదేశాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఆయా స్కీములలో యూనిట్ విలువ (ఎన్‌ఏవీ) షేర్ల ధరతో పాటు మారకం రేటుపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రూపాయితో పోలిస్తే డాలరు పెరిగితే.. ఫండ్ ద్వారా రాబడులు మరింతగా పెరుగుతాయి. అదే సమయంలో ఫండ్ విలువా పెరిగిందంటే.. ఇక డబుల్ ధమాకాలాంటిదే. పోర్ట్‌ఫోలియో, డాలరు.. రెండూ పెరిగితే.. సాధారణంగా వచ్చే లాభం కన్నా మరింత ఎక్కువ వస్తుంది. ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేవలం రూపాయి హెచ్చుతగ్గుల కోసమే కాకుండా డైవర్సిఫికేషన్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. అలాగే, ఫండ్‌లను ఎంచుకునేటప్పుడు అవి ఎక్కడెక్కడ, ఎలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయన్నది చూసుకుంటే మంచిది.