
రాజ్‌నాథ్ పాక్‌లో ఎన్నిసార్లు టాయ్‌లెట్‌కు వెళ్లారు?
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత వారం సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లినప్పుడు పాకిస్థాన్ మీడియా, అధికారులు అడుగడుగున ఆయన్ను ఏదోరకంగా అవమానించేందుకే ప్రయత్నించారు. సార్క్ సమావేశాల్లో ఆయన ప్రసంగాన్ని భారత జర్నలిస్టులు కవర్ చేయకుండా అడ్డుకున్నారు. టెర్రరిస్టులను అమరు వీరులుగా కీర్తించడం ఏమాత్రం తగదని రాజ్‌నాథ్ సింగ్ సార్క్ వేదికపై నుంచి పరోక్షంగా పాక్‌ను హెచ్చరించిన అంశాన్ని ఏ మాత్రం కవర్ చేయని పాక్ మీడియా, ఆయన ఎందుకు 8 సార్లు టాయ్‌లెట్‌కు వెళ్లారంటూ అర్థంపర్థంలేని కథనాలను ప్రముఖంగా ప్రచురించింది.
ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడ కూడదో, ఎప్పటికప్పుడు భారతీయ అధికారులను సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించేందుకు వీలుగానే ఆయన ఎనిమిదిసార్లు టాయ్‌లెట్స్‌కు వె ళ్లారని పాక్ మీడియా వ్యాఖ్యానించింది. వాస్తవానికి రాజ్‌నాథ్ సింగ్ రెండే రెండు సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లారని, అది సార్క్ సంప్రదాయం ప్రకారం సార్క్ నాయకులు పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ను కలుసుకున్నప్పుడు, సార్క్ సమావేశాలు ముగిశాక మరోసారి వాష్ రూమ్ వెళ్లారని భారత మీడియా తెలియజేసింది. ఆ సమయంలో రాజ్‌నాథ్ సింగ్ వద్ద సెల్‌ఫోన్ కూడా లేదని, ఆయన భారత్‌లో ఉన్నప్పుడు కూడా తన వెంట సెల్‌ఫోన్ పెట్టుకోరని హోం శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.
రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్ హోం మంత్రి ఇచ్చిన విందుకు హాజరుకాకపోవడాన్ని కూడా పాక్ మీడియా వివాదం చేసింది. తాను ఎందుకు విందులో పాల్గొనకుండా భారత్ తిరిగి రావాల్సి వచ్చిందో రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ ముఖంగానే వివరణ ఇచ్చిన విషయం తెల్సిందే. తనను విందుకు ఆహ్వానించిన పాక్ హోం మంత్రి తనను తీసుకొని వెళ్లకుండానే ఒక్కరే కారెక్కి వెళ్లిపోయారని, ఆయనతోపాటు పాక్ అధికారులెవరూ ఆ విందుకు హాజరుకాలేదని, అలాంటప్పుడు భారత్ పరువును కాపాడేందుకే తాను విందుకు వెళ్లలేదని ఆయన వివరణ ఇచ్చారు.
సార్క్ సమావేశాలను కవర్ చేయడానికి పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మీడియాకు బహూశ మొదటిసారి పాక్ అధికారులు, పాక్ మీడియా అడ్డుకొంది. సార్క్ సమావేశాల వేదిక వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించిన పాక్ అధికారులు, లాబీలో సార్క్ దేశాల నేతలను కలుసుకునేందుకు భారత మీడియా చేసిన ప్రయత్నాలను పాక్ మీడియా సహకారంతో అడ్డుకున్నారు. పాక్ భద్రతా సిబ్బంది ఆదేశాల మేరకు భారత్ మీడియా ఎక్కడికెళితే అక్కడ మీడియాకు ముందు నిలబడి ఫొటోలు తీయకుండా, వీడియోలో తీయనీయకుండా పాక్ మీడియా అడ్డుకుందని భారత మీడియా సంస్థలు ఆదివారం ఆరోపించిన విషయం తెల్సిందే. ఎప్పటిలా కాకుండా ఈ సారి భారత జర్నలిస్టులకు వీసాలను కూడా పాక్ అధికారులు నియంత్రించారు.