
ఎంసెట్.. ఇక ఈఏసెట్!
ఎంసెట్ నుంచి మెడికల్ స్ట్రీమ్ తొలగింపు!
- ఆయుష్ ప్రవేశాలు కూడా నీట్ ద్వారానే.. స్పష్టత ఇచ్చిన వైద్యారోగ్య శాఖ
- ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సులకే రాతపరీక్ష
- నేటి నుంచి దరఖాస్తులు.. మార్పులు చేసిన ఎంసెట్ కమిటీ
- వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్‌కూ జాతీయ స్థాయి పరీక్షే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఇక ఈఏసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)గా మారిపోతోంది. ఎంసెట్‌లో ఇంతకాలం ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల కోసం మెడికల్ స్ట్రీమ్ పరీక్ష నిర్వహించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పటికే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)’పరిధిలోకి వెళ్లిపోగా.. తాజాగా ఆయుష్ కోర్సులు కూడా నీట్ పరిధిలోకి వెళ్లాయి. ఈ మేరకు ఎంసెట్ కమిటీకి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. దీంతో ప్రస్తుతం ఎంసెట్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, దాని సంబంధిత కోర్సులే మిగిలాయి.
మరోవైపు వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి దానిని అమల్లోకి తేవాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించింది కూడా. ఈ నిర్ణయం అమలైతే.. ఎంసెట్‌లో అగ్రికల్చర్, బీఫార్మా, ఫార్మా–డీ, బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ (సీఏ, బీఎం) కోర్సులే మిగలనున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉండనుంది.
ఇక ఈఏసెట్
నీట్ ద్వారానే ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయని ఎంసెట్ కమిటీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డికి ఒక లేఖ పంపుతున్నట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సమాచారమిచ్చారు. దీంతో ‘ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఎంసెట్)’నుంచి మెడికల్ స్ట్రీమ్ పరీక్షను పూర్తిగా తొలగించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఇకపై ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌తోపాటు దాని పరిధిలోకి వచ్చే వెటర్నరీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏసెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న దరఖాస్తుల ప్రక్రియలో ఈ మేరకు మార్పులను చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయుర్వేద, హోమియో, నేచురోపతి, యోగా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఇక ఎంసెట్‌కు (ఇప్పటివరకు పిలుస్తున్నది) దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. వారంతా నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
నేటి నుంచి దరఖాస్తులు..
మెడికల్ స్ట్రీమ్‌ను తొలగించనున్నందున.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సెట్ (ఈఏసెట్) నిర్వహించేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, దాని పరిధిలోని వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈనెల 15న వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వరకు దరఖాస్తుల ప్రక్రియ ఉండనుంది. విద్యార్థులు ్ఛ్చఝఛ్ఛ్టి. ్టటఛిజ్ఛి. ్చఛి. జీn వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 16 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తుల్లో పొరపాట్ల సవరించుకోవడానికి అవకాశం ఉండనుంది. ఆలస్య రుసుముతో వచ్చే నెల 21 నుంచి మే 8వ తేదీ వరకు (రూ. 500 నుంచి రూ. 10 వేల వరకు, ఆలస్య రుసుమును బట్టి గడువు ఇస్తారు) దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు మే 5 నుంచి 9వ తేదీ వరకు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ రాత పరీక్ష.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అగ్రికల్చర్, వెటర్నరీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు.