
తెలంగాణ ఎంసెట్-2 రద్దు
మెడికల్ పేపర్ లీక్ కావడంతో.. ఎంసెట్-2ను రద్దుచేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటివరకు మెడికల్ కోర్సుల కోసం దాదాపు ఐదు ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులంతా మరోసారి ప్రవేశపరీక్ష రాసి తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున ఇంకా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే.. పిల్లల మీద తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇది 56 వేలమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి.. రద్దు చేయడం తగదన్న వాదనలు గట్టిగా వినిపించాయి గానీ.. ఒక్కరికి పేపర్ లీకయినా పరీక్ష రద్దుచేయాలని న్యాయ నిపుణులు సూచించడంతో ఇక పరీక్షను రద్దు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడైనా రద్దుచేసి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారానే ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు. కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లను జారీచేసి, ఆగస్టు మొదటివారంలో పరీక్ష నిర్వహించి, రెండోవారంలో ఫలితాలు ప్రకటించి సెప్టెంబర్ నాటికే తరగతులు ప్రారంభిస్తే విద్యాసంవత్సరం వృథా కాకుండా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.