
అమ్మకు సీరియస్: ఎమ్మెల్యేల అర్ధరాత్రి సమావేశం
చెన్నై: గడిచిన 74 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ, ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తమిళనాడు మంత్రి వర్గం, ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు అమ్మ పరిస్థితిపై వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి(జయ)కి సంబంధించిన శాఖలన్నీ నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తోన్న వ్యక్తిగా ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఏఐడీఎంకే ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అసంపూర్తిగా ముగిసిన ఆ సమావేశంపై ఏఐడీఎంకే కీలక నేత సి.పొన్నయ్యన్ సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
‘అమ్మ కోలుకోవాలని మేమంతా ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతలపై మంత్రులు చర్చిస్తున్నారు. అయితే ఇంకా మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలు అందరం సోమవారం అర్థరాత్రి తర్వాత మళ్లీ సమావేశం అవుతాం’ అని మాజీ మంత్రి సి. పొన్నయ్యన్ చెప్పారు. కీలకమైన ఎమ్మెల్యేల సమావేశానికి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతోపాటు పార్టీ సీనియర్ నేతలు, ఇతర ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జయ ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. చెన్నైలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ద్వారా ప్రధాని మోదీ తమిళనాడులోని పరిస్థితులను తెలుసుకున్నారు.