'రాసలీలల' గవర్నర్ రాజీనామాకు ముందు..!
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూనే.. పీఏకు ప్రమోషన్ ఇచ్చిన వైనం
రాజ్‌భవన్ కేంద్రంగా లైంగిక కార్యకలాపాలు జరిపారన్న ఆరోపణలతో మేఘాలయ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన వీ షణ్ముగనాథన్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షణ్ముగనాథన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో.. కేంద్రం ఆదేశాల మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తన పీఏ (పర్సనల్ అసిస్టెంట్)గా ఉన్న ఓ మహిళకు ప్రజాసంబంధాల అధికారి (పీఆర్‌వో)గా ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
సదరు మహిళను గవర్నర్ స్వయంగా ఇంటర్వ్యూ చేయడమే కాదు.. నిబంధనలు పక్కకుతోసేసి.. తన రాజీనామాకు ముందే ఈ పదోన్నతి కల్పించారు. ఈ పోస్టు కోసం ఇంటర్వ్యూకు హాజరైన ఇతర అభ్యర్థులు కూడా గవర్నర్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులు ఇంటర్వ్యూ చేసిన తర్వాత గవర్నర్ తమకు ఫోన్ చేసి.. 'వన్ టు వన్ ఇంటర్వ్యూ' చేశారని పేర్కొన్నారు. 2016 మార్చిలో గవర్నర్‌కు పీఏగా నియమితులైన మహిళనే.. డిసెంబర్ 7న పీఆర్‌వోగా గవర్నర్ తిరిగి నియమించుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. పీఏగా ఉన్నప్పుడు ఆమెకు రూ. 6500 నుంచి 12,700 వరకు వేతనం ఉండగా, పీఆర్‌వోగా నియమితులైన తర్వాత నెలకు రూ. 30వేల జీతాన్ని నిర్ణయించారు. 'వన్ టు వన్ ఇంటర్వ్యూ' పేరిట తనతో గవర్నర్ అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళా అభ్యర్థి తనతో చెప్పినట్టు ఈ పోస్టుకు దరఖాస్తు చేసిన మరో మహిళా అభ్యర్థి తెలిపారు. ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకు తనను పిలువలేదని, కానీ ఈ ఇంటర్వ్యూ కోసం ఇద్దరు మహిళా అభ్యర్థులకు గవర్నర్ స్వయంగా ఫోన్ చేశారని ఆమె చెప్పారు.