పరువు నష్టం దావా వేసిన ట్రంప్ భార్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ను ఇటీవల కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థల్లో ప్రచురితమైన కథనాలు తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. మెలానియా ట్రంప్ గత జీవితం, ఆమె అమెరికాకు వచ్చి ట్రంప్ భార్యగా మారిన క్రమం లాంటి తదితర వివరాలను వెల్లడిస్తూ ఇటీవల 'డెయిలీ మెయిల్'లో కథనం ప్రచురితమైంది.
ఓ స్లోవేకియన్ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ డెయిలీ మెయిల్ ఈ కథనాన్ని ప్రచురించింది. అందులో.. గతంలో మెలానియా ట్రంప్ మోడలింగ్ చేసిన ఏజెన్సీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు మోడలింగ్ ఏజెన్సీ సంపన్నులకు మహిళలను సరఫరా చేసేదంటూ డెయిలీ మెయిల్ ఆరోపణలు చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన మెలానియా డెయిలీ మెయిల్తో పాటు అలాటి కథనాన్నే ప్రచురించిన మరో మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశారు.
డెయిలీ మెయిల్ వెల్లడించిన కథనం వంద శాతం అసత్యమని.. అది తన వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉందని మెలానియా ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిపై మేరీలాండ్లోని మోంట్గోమరీ కోర్టులో గురువారం పరువునష్టం దావా వేసినట్లు ఆమె ప్రతినిథి చార్లెస్ హార్డర్ తెలిపారు. 150 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఆమె డిమాండ్ చేశారు. మెలానియా పరువునష్టం దావా వేసిన రెండు గంటల్లోనే డెయిలీ మెయిల్ తన కథనాన్ని ఉపసంహరించుకోవడం విశేషం. అంతేకాదు.. తాము ప్రచురించిన కథనం ఉద్దేశం మెలానియా 'ఎస్కార్ట్'గా పనిచేశారని కాదని డెయిలీ మెయిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.