
మంత్రి లోకేశ్ విస్మయం
అమరావతి: తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా విస్తరించిన బెల్టు షాపుల వల్ల మహిళలు పడుతోన్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేనప్పటికీ దాదాపు అన్ని పెద్ద గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతుండటం, ఆబ్కారీ శాఖ చూసిచూడనట్లు వ్యవహరించడం తెలిసిందే. తాజాగా తమ గ్రామంలోని బెల్టు షాపు వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న వైనాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహారావు అనే యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చాడు.
బెల్టు షాపు ఫొటోను జతచేసి..‘అయ్యా.. మా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తోన్న ఈ బెల్టుషాపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా చాలా సార్లు ఫిర్యాదులు చేశాం. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని పౌరుడు పేర్కొన్నాడు. గ్రామీణాభివృద్ధి శాఖకు కూడా మంత్రిగా ఉన్న లోకేశ్.. ఆ ఫొటోను చూసి ‘ఏంటి! ఇది బెల్టు షాపా?’ అని విస్మయం వ్యక్తంచేశారు. ఆపై, ‘ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులను అలర్ట్ చేస్తా’నని హామీ ఇచ్చారు. కానీ..
చివర్లో ‘ఒకవేళ ఆ(బెల్టు షాప్) సమస్య ఇంకా కొనసాగుతున్నట్లయితేనే చర్యలు తీసుకుంటాం’అని చిన్న మెలిక పెట్టారు మంత్రి లోకేశ్! అసలు బెల్టు షాపులే చట్టవిరుద్ధం. దానిని తక్షణమే మూసేయిస్తామని గట్టిగా చెప్పాల్సిందిపోయి.. ‘సమస్య ఉంటేనే చర్యలు తీసుకుంటా’మని మంత్రి అనడంపై స్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాటి ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం అమలుకాగా.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత నిషేధం ఎత్తేసిన సంగతి తెలిసిందే.
(డెస్క్‌టాప్ నుంచి తీసిన స్క్రీన్ షాట్)