మా గోస చూడయ్యా..
హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నాలాలు, చెరువులు ఉప్పొంగి ఇళ్లను ముంచెత్తడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హుస్సేన్ సాగర్ సహా శివారులోని పలు చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. ప్రభుత్వ అభ్యర్థనమేరకు రంగంలోకి దిగిన ఆర్మీ.. అల్వాల్ లో వరదనీటిలో చిక్కుకున్నవారిని పడవలద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఇతర అధకారులతో కలిసి శుక్రవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. (హైదరాబాద్ అతలాకుతలం..రంగంలోకి ఆర్మీ)
ఈ క్రమంలోనే అల్వాల్ లోని వెన్నెలగడ్డ చెరువు వద్దకు వెళ్లిన కేటీఆర్ దగ్గరకు ఒక వృద్ధురాలు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. 'మా గోస చూడయ్యా..' అంటూ మంత్రిగారి చెయ్యిపట్టుకునిమరీ తన ఇంటికి తీసుకెళ్లింది. వృద్ధురాలికి అవసరమైన సహాయసహకారాలు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. రోజంతా పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు బాధితుల కోసం చేపడుతోన్న చర్యలను పర్యవేక్షించారు. కొన్ని ప్రాంతాల్లో యువకులు కేటీఆర్ ను ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపారు.