మిస్ కాల్ కొట్టు..
డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు.
వినూత్న తరహాలో మిస్డ్ కాల్ కొట్టూ, అంటూ ఫ్యాన్సీ నంబర్‌గా 7220072200ను ప్రకటించారు.
ఇక ఎన్నికల బరిలో దిగేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధమయ్యారు.
సీట్ల పందేరానికి దళపతి స్టాలిన్ నేతృత్వంలో కమిటీని నియమించారు.
* వినూత్నంగా కరుణ ప్రచారం
* ప్రచారానికి 7220072200 ఫ్యాన్సీ నంబర్
* 22 నుంచి ఆశావహుల ఇంటర్వ్యూ
* సీట్ల పందేరానికి ‘స్టాలిన్’ కమిటీ
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో ముందుకు సాగుతున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి అందరి కన్నా ముందుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లు వంటి మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్న కరుణానిధి, మంగళవారం తన ప్రత్యేక ప్రసంగం కోసం మిస్డ్ కాల్ కొట్టూ అంటూ ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ప్రకటించేశారు.
వినూత్న రీతిలో ఆసక్తి గల వారు.. మిస్డ్ కాల్ కొట్టూ అంటూ మొబైల్ ఫోన్లలో ఈ ఫ్యాన్సీ నంబర్ ప్రత్యక్షం అవుతున్నాయి. దీనికి మిస్డ్ కాల్ ఇస్తే చాలు, కొన్ని క్షణాల్లో ల్యాండ్ లైన్ నంబర్ నుంచి కాల్ రావడం, నేను మీ..కరుణానిధి అంటూ ప్రసంగం, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ ముప్పై నిమిషాల పాటుగా ప్రచారం సాగుతుండడం గమనార్హం. అయితే, ప్రసంగం వినేందుకు ఓపిక ఉండాలే గానీ, మిస్డ్ కాల్ కొట్టిన వాళ్లకు మాత్రం ఎలాంటి చార్జీల భారం ఉండదు.
ఇంటర్వ్యూలు : డీఎంకే తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దరఖాస్తుల పరిశీలన పర్వం ముగిసింది. ఇక, ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేసి, ఎన్నికల బరిలో దించేందుకు తగ్గ కసరత్తుల్లో కరుణానిధి నిమగ్నం అయ్యారు. ఈనెల 22 నుంచి 27వ తేది వ రకు అన్నా అరివాలయంలో ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేయనున్నారు.
22న ఉదయం తొమ్మిది గంటలకు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా, సాయంత్రం నాలుగు గంటలకు విరుదునగర్, తేని, దిండుగల్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 23న ఉదయం తొమ్మిది గంటలకు శివగంగై, మదురై, ఈరోడ్, సాయంత్రం నాలుగు గంటలకు నీలగిరి, కోయంబత్తూరు, సేలం, 24న ఉదయం తొమ్మిది గంటలకు పుదుకోట్టై, నామక్కల్, తిరుప్పూర్, సాయంత్రం నాలుగు గంటలకు కరూర్, పెరంబలూరు, అరియలూరు, 25న ఉదయం నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, కడలూరు, సాయంత్రం విల్లుపురం, ధర్మపురి , కృష్ణగిరి, 26న ఉదయం తిరువణ్ణామలై, వేలూరు, కాంచీపురం, సాయంత్రం తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఆశావహుల ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇక, 27వ తేది ఉదయం పుదుచ్చేరి, కారైక్కాల్‌లలోని ఆశావహుల ఇంటర్వ్యూలు జరుగుతాయని డీఎంకే కార్యాలయం ప్రకటించింది.
స్టాలిన్ కమిటీ : బలమైన కూటమి లక్ష్యంగా డీఎంకే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌లు డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నాయి. ఇక, మరికొన్ని కుల, మైనారిటీ సామాజిక వర్గాల పార్టీలతో పాటుగా డీఎండీకే ఈ కూటమిలోకి వస్తుందన్న ప్రచారం సాగుతున్నది. ఈ పార్టీలతో పొత్తులు ఖరారు చేయడంతో పాటుగా, సీట్ల పందేరం కొలిక్కి తెచ్చేందుకు తగ్గట్టుగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో నాయకులు దురై మురుగన్, టీఆర్ బాలుల కమిటీని రంగంలోకి దించనున్నారు.