బిహార్ వాసులు ఈసారి ఎటు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీయేకు స్వల్ప అధిక్యం కట్టబెట్టేలా ఓటర్లు కనిపిస్తున్నారు. సర్వేలు చేసిన మీడియా సంస్థల్లో చాలావరకు ఇదే విషయం చెబుతున్నాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 122 స్థానాలు దక్కాలి.
అయితే, ఇండియా టీవీ- సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 119, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి 116 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. మరో 8 స్థానాలు మాత్రం ఇతరులకు దక్కుతాయన్నారు. అంటే, ఎన్డీయే కూడా అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోతుందని అంచనా వేశారన్నమాట.
ఇండియా టుడే- సిసెరో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో, ఆ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 125 స్థానాలను, జేడీ(యూ) నేతృత్వంలోని మహాకూటమి 106 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. 2010లో ప్రస్తుత జేడీయూ కూటమికి 141 స్థానాలు రాగా, ప్రస్తుత బీజేపీ కూటమి 94తో సరిపెట్టుకుంది.
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న బిహార్ ఎన్నికల సమరంలో ఎవరు ఎక్కడుంటారనే విషయం అందరికీ ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ ఏడాదిన్నర పాలనకు ఒకరకంగా ఇది ప్రోగ్రెస్ కార్డు అని కొందరు అంటుంటే, నితీష్ కుమార్ సారథ్యంలో బిహార్ రాష్ట్రం ఎంతవరకు ముందడుగు వేసిందో తెలిపే మార్కు అని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే- సిసెరో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
బిహార్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇప్పటికీ నితీష కుమారేనని అంటున్నారు. ఆయనకు గతంలో 29 శాతం ప్రజాదరణ ఉండగా ఇప్పుడది 38 శాతానికి పెరిగిందంటున్నారు. ఆయన తర్వాతి స్థానంలో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ నిలిచారు. ఆయనకు 22 శాతం ప్రజాదరణ ఉన్నట్లు తేలింది. లాలు ప్రజాదరణ మాత్రం 12 శాతం నుంచి 9 శాతానికి పడిపోయిందట.
బిహార్ బరిలో గెలిచేదెవరో?
Published Thu, Oct 8 2015 7:57 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement