
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడి
♦ అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత
♦ ‘నోటా’కు ఒకటో ప్రాధాన్యత ఓటేస్తే తర్వాతి ప్రాధాన్యతలు చెల్లవు
♦ 145 మంది ఓటర్లకు పోలింగ్ సహాయకులు
సాక్షి, హైదరాబాద్: నాలుగు జిల్లాల్లో ఆదివారం జరిగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు మున్సిపాలిటీల కార్పొరేటర్లు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లు ఓటర్లుగా ఉంటారని తెలిపారు. నాలుగు జిల్లాల్లోని 19 రె వెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓటర్లు ప్రాధాన్యత కమంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు.
ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఉదా రంగు(వాయిలెట్) స్కెచ్ పెన్‌ను మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. ఓట్లను ప్రాధాన్యత క్రమంలో సంఖ్యల్లోనే రాయాలని, అక్షరాలు, గుర్తులు వాడితే ఓట్లు చెల్లకుండా పోతాయని వివరించారు. నిరక్షరాస్యులు, అంధులు, ఓటు హక్కు వినియోగించుకోలేని 145 మంది ఓటర్లకు సహాయకులను తీసుకెళ్లే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు సహాయకుల కోసం 509 మంది దరఖాస్తు చేసుకుంటే అర్హులైన 145 మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. 30వ తేదీన నాలుగు జిల్లాల్లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు, ఖమ్మం, నల్లగొండలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగనుందని, రెండు స్థానాలు ఉన్న చోట కూడా ఒకే బ్యాలెట్ పేపర్ ఉంటుందని వివరించారు.
నోటాకూ ఓటేసే అవకాశం
మండలి ఎన్నికల్లో ‘నోటా’కు కూడా అవకాశం కల్పించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. బ్యాలెట్ పేపర్‌లో చివరన ‘నోటా’ గుర్తు ఉంటుందని, ఒకటో ప్రాధాన్యత ఓటు నోటాకు వేసి, 2, 3 ప్రాధాన్యత ఓట్లను వేరే అభ్యర్థులకు వేసినా చెల్లదని తెలిపారు. ఒకటో ప్రాధాన్యత ఓటు ఎవరైనా వేసి, రెండో ప్రాధాన్యత ‘నోటా’కు ఇస్తే ఒకటో ప్రాధాన్యత ఓటు చెల్లుతుందన్నారు. పోలింగ్ సందర్భంగా భద్రత కోసం రాష్ట్ర పోలీసులకు అదనంగా కేంద్ర బలగాలను రప్పించినట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులను 19 పోలింగ్ స్టేషన్లలో నియమించినట్లు వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, ఓటు వినియోగించుకోవడం మినహా అన్నీ లైవ్ వెబ్‌కాస్ట్‌లో ఎన్నికల సంఘం పరిశీలిస్తుందన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్ బయట కూడా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ బోమన్నారు. ఓటు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రతి స్టేషన్‌లో పది ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యాంపుల గురించి తమకు వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీయగా... ఓటర్లు సొంత డబ్బులతో వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు తేలిందన్నారు. వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎన్నికల సంఘానికి లేదని చెప్పారు. ఎవరైనా అభ్యర్థులు ఓటర్లను తీసుకెళ్లినట్లు రుజువులు చూపిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద శిక్షించే అవకాశం ఉంటుందన్నారు.