అది ముస్లింల ఊచకోత
నాటి ఘోరానికి మోడీయే నేతృత్వం వహించారు: ములాయం
అలహాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ‘2002 గుజరాత్ అల్లర్లు’ జరిగాయని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ విమర్శించారు. ‘‘మీరే నాడు ముస్లింల ఊచకోతకు నేతృత్వం వహించారు. చేసిందంతా చేసేసి.. ఇప్పుడు ఓట్ల కోసం మీ నాయకులు ముస్లింలను క్షమాపణ కోరుతున్నారు’’ అంటూ నిప్పులు చెరిగారు. ముస్లింలను క్షమాపణ కోరుతున్నట్లుగా ఇటీవల బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఆయన ఈ విమర్శలు సంధించారు. ఆదివారం అలహాబాద్‌లో ఎస్పీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ములాయం మాట్లాడారు. ప్రసంగం మొత్తం మోడీపై విమర్శలతోనే సాగింది. ఉత్తరప్రదేశ్‌ను గుజరాత్ అంతటి సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా చేయడం ములాయం వల్ల కాదని, ఎందుకంటే అలా చేయడానికి 56 అంగుళాల ఛాతీ కావాలని ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఎస్పీ అధినేత 2002 అల్లర్లను తెరపైకి తెచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
మీరు ఢిల్లీపై దండెత్తడానికి చాలా ఎత్తులు వేస్తున్నారు. కానీ మీ కల నెరవేరదు. ముస్లిం సోదరులు తెలివితక్కువ వాళ్లని మీ అభిప్రాయమా? వాళ్లు ధైర్యవంతులు, సున్నిత మనస్కులు, విశ్వాసం కలవారు.. మీ ఎత్తులు చెల్లవు.
పన్నెండేళ్ల పాటు గుజరాత్‌ను అభివృద్ధి చేశానని మోడీ చెప్పుకుంటున్నారు. కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. అభివృద్ధికి ఆధారం లేదు. గుజరాత్‌లో 30 శాతం మంది మహిళలు, 50 శాతం మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. అత్యంత దారుణంగా కలుషితమైన నదుల్లో కొన్ని గుజరాత్‌లోనివే. అసంఘటిత రంగంలోని కార్మికులకు అక్కడ ఇచ్చే వేతనాలు.. యూపీలో కంటే తక్కువ. దీన్ని మీరు(మోడీ) అభివృద్ధి అంటారా? దీన్ని పాలన అంటారా?
నేను ఆయనకు(మోడీకి) ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోసిన తర్వాత వారిని పరామర్శించడానికి వెళ్లి నేను నా సత్తా చాటుకున్నాను. ‘మీపై ఎవరైనా దాడి చేస్తే మా బాధ్యత కాదు’ అని మోడీ ప్రభుత్వం నన్ను బెదిరించడానికి చూసినా లెక్కచేయకుండా వెళ్లి బాధితులను ఓదార్చాను.
ఇక కాంగ్రెస్ సంగతిచూస్తే.. ఆ పార్టీకి పేదలు, మైనారిటీల విషయంలో ఒక విధానమంటూ లేదు. కనీసం దేశ సరిహద్దులు కూడా కాంగ్రెస్ చేతిలో సురక్షితం కావు.