మహిళకు మరణశిక్ష
ఇస్లామాబాద్: పరువు కోసం కన్నకూతుర్ని సజీవ దహనం చేసిన పాకిస్థాన్ మహిళకు కోర్టు మరణశిక్ష విధించింది. ‘పరువుహత్య’ కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు కొత్త చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిన కొద్ది నెలల తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించడం గమనార్హం. తమ అభీష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుందనే కోపంతో తన కుమార్తె జీనత్ రఫీక్(18)ను ఆమె తల్లి పర్వీన్ బీబీ నిప్పటించి సజీవ దహనం చేసింది. 2016, జూన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పాకిస్థాన్ లో సంచలనం రేపింది. హసన్ ఖాన్ అనే వ్యక్తితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
తన కుటుంబానికి తలవంపులు తెచ్చిందనే కూతుర్ని హతమార్చినట్టు కోర్టులో పర్వీన్ ఒప్పుకుంది. కొడుకు అనీస్ సహాయంతో కూతుర్ని కడతేర్చిందని పోలీసులు అనుమానించారు. ఈ కేసులో వాదనలు విన్న ఏటీసీ కోర్టు న్యాయమూర్తి ఆజామ్ చౌధురి సోమవారం తీర్పు వెలువరించారు. పర్వీన్ కు మరణశిక్ష, అనీస్ కు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.