గవర్నర్ ఆచార్యతో జెలియాంగ్(ఫైల్)
కోహిమా: తమిళనాడు రిసార్టు రాజకీయాలు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ కు పాకాయి. ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ పై అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)కు చెందిన 40 ఎమ్మెల్యేలు బుధవారం తిరుగుబాటు చేశారు. వీరిని అసోంలోని కాజీరంగా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన రిసార్టుకు తరలించారు. దీంతో నాగాలాండ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.
ఎన్‌పీఎఫ్ పార్టీ అధ్యక్షుడు షుర్ హోజెలీ లీజీట్సు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. గవర్నర్ ఆచార్యతో కలిసి సీఎం జెలియాంగ్ గురువారం ఢిల్లీ వెళ్లారు. వీరిద్దరూ శుక్రవారం పీఎంఓ మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ నేత రాంమాధవ్, ఎంపీ, మాజీ సీఎం నైపూ రియోతో సమావేశమయ్యారు.
గవర్నర్ ఢిల్లీ నుంచి రాగానే పరిస్థితులు లీజీట్సు కు ప్రతికూలంగా మారాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని నైపూ రియోకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. జెలియాంగ్ కంటే ముందు నాగాలాండ్ సీఎంగా నైపూ రియో పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎం పదవిని వదులుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వానికి, నాగా గిరిజనులకు మధ్య వివాదం నడుస్తుండడంతో గత కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలతో నాగాలండ్ అట్టుడుకుతోంది. జెలియాంగ్ రాజీనామా చేయాలని నాగాలాండ్ ట్రైబల్ యాక్షన్ కమిటీ(ఎన్ టీఏసీ) గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సంక్షోభం తలెత్తింది. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్‌పీఎఫ్ కు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.