కార్పొరేటర్లను భీమిలి రిసార్టుకు తరలించిన టీడీపీ
పోలింగ్ సమయానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు
నేడు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
ప్రలోభాలే అజెండాగా కూటమి నేతలు
వైఎస్సార్ సీపీ, ఇండిపెండెంట్లకు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల ఎర
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ రాజకీయాలు రిసార్టుకు చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమకు అలవాటైన కొనుగోళ్ల ఎరతో కార్పొరేటర్లను మభ్యపెట్టింది. తమకు మద్దతునిచ్చిన కార్పొరేటర్లు ఎక్కడ చేజారిపోతారోనన్న భయంతో క్యాంపు రాజకీయాలు చేస్తోంది. అందరిని భీమిలిలోని ఓ రిసార్టుకి తరలించేసింది. పోలింగ్ సమయానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు విజయమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అడుగులు వేస్తోంది. ఉదయం 10 గంటలకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించి విజేతలను ప్రకటించనున్నారు.
ఇవీ బలాబలాలు..
గ్రేటర్‌లో 98 మంది వార్డులుండగా ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లున్నారు. 21 వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన వారిలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు.. డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీ, జనసేనలో చేరారు. వాస్తవానికి 97 మందిలో వైఎస్సార్ సీపీ నుంచి 58 మంది, టీడీపీ నుంచి 29, జనసేన నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్స్ నలుగురు, సీపీఐ, సీపీఎం, బీజేపీలో చెరో కార్పొరేటర్ విజయం సాధించారు. పార్టీలు మారిన తర్వాత ప్రస్తుత బలాబలాలు చూస్తే.. వైఎస్సార్ సీపీలో 46 మంది, టీడీపీలో 37, జనసేనలో 8, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కరుండగా స్వతంత్రులు ముగ్గురున్నారు. మొత్తంగా ప్రస్తుతం చూస్తే.. ఒక ఇండిపెండెంట్‌తో కలిపి వైఎస్సార్ సీపీకి 47, కూటమికి 47తో పాటు ఇద్దరు ఇండిపెండెంట్స్ మద్దతుతో కలిపి మొత్తం 49 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ కంటే కూటమికే బలం ఉన్నా భయంతో బిక్కుబిక్కుమంటుండటం గమనార్హం.
ఓటమి భయంతో..
అధికార టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకొని రిసార్టు రాజకీయాలకు తెరతీసింది. తమకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లు చేజారిపోతారేమోనన్న భయంతో కార్పొరేటర్లను భీమిలిలోని ఓ రిసార్టుకి తరలించారు. తమతో వచ్చిన కార్పొరేటర్లకు రూ.3 లక్షలు చొప్పున అందించినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం తమ మద్దతు కార్పొరేటర్లను రిసార్టుకు చేర్చగా.. వీరిలో కొందరు కార్పొరేటర్లు మనసు మార్చుకొని ఇంటికి వెళ్లిపోతామని చెప్పడంతో టీడీపీలో మళ్లీ భయం పట్టుకుంది. వారిని బుజ్జగించే పనిని కీలక కార్పొరేటర్లకు అప్పగించారు. రిసార్టు దగ్గర జామర్లు కూడా అమర్చినట్లు సమాచారం.
ఇండిపెండెంట్ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు లాబీయింగ్ నడుపుతున్నారు. చివరి వరకు ఎవరు దొరికితే వారికి రూ.3 నుంచి రూ.5 లక్షలైనా ఇచ్చి ఓటు వేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment