
ముస్లింల వికాసానికి కృషి
దేశంలో ఓ పౌరుడికి లభించాల్సిన అన్ని హక్కులను ముస్లింలకు కల్పించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు సూచించారని...
కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఓ పౌరుడికి లభించాల్సిన అన్ని హక్కులను ముస్లింలకు కల్పించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు సూచించారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా చెప్పారు. ముస్లిం యువతీయువకులు ఓ చేతిలో తమ పవిత్ర గ్రంథం ఖురాన్‌ను, మరో చేతిలో ల్యాప్‌టాప్‌ను పట్టుకోవాలన్నదే తమ ఆశయమని మోదీ చెప్పారన్నారు. ముస్లింలకు అభివృద్ధి ఫలాలను పంచేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీల తరహాలో ముస్లిం విద్యార్థులందరికీ కేంద్ర స్కాలర్‌షిప్‌లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ‘విద్య ఔన్నత్యం’ అంశంపై మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆదివారమిక్కడ జరిగిన సదస్సులో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌తో కలసి నజ్మా హెప్తుల్లా పాల్గొన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి అయిన తన తాత దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ కృషి ఫలితంగానే దేశంలో యూజీసీ, ఐఐటీ లాంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో పాటు 600 వర్సిటీల ఏర్పాటు జరిగిందన్నారు.
ఈ విషయంలో అబుల్ కలాంకు లభించాల్సిన ఖ్యాతిని గత ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయన్నారు. ఆంధ్ర ప్రాంత విలీనానికి ముందు తెలంగాణలో 33 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ముస్లింలేనని, విలీనం వల్ల ముస్లింల ప్రాతినిధ్యం 2% పడిపోయిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత పేర్కొన్నారు. అధికారిక భాషగా నిజాం పాలకుల హయాంలో ఉర్దూ ఓ వెలుగు వెలిగిందని, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ భాషలకు దుర్గతి పట్టిందని కవిత చెప్పారు.
రాష్ట్రంలోని ఉర్దూ వర్సిటీ శాఖల ఏర్పాటుకు కేంద్రం చొరవ తీసుకోవాలని మహమూద్ అలీ కోరగా, కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. మదర్సాలను ఆధునిక సాంకేతిక విద్య తో అనుసంధానం చేయాలని జస్టిస్ ఇక్బాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ కులపతి జఫర్ సరేశ్‌వాలా, చెన్నై మక్కా మసీదు చీఫ్ ఇమాం శంషోద్దీన్ మహమ్మద్ పాల్గొన్నారు.