కేసు వల్లే కృష్ణాజలాల సాధనలో రాజీ పడ్డారా?
కృష్ణా జలాలను సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాజీ పడినట్లు కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడటంలో బాబు సర్కారు విఫలం అయ్యిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా కాపాడుకున్న ఏపీ హక్కులను కాస్తా కృష్ణార్పణం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, కృష్ణా జలాల హక్కులను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈనెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామని మైసూరారెడ్డి చెప్పారు.
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం వల్లే కృష్ణాజలాలు సాధించడంలో చంద్రబాబు రాజీ పడినట్లు కనిపిస్తోందని ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులు కాలరాయడం అన్యాయమని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నారని మైసూరా ఆరోపించారు.