
బలపరీక్షకు సీఎం డుమ్మా!
కోహిమా: పదవీగండాన్ని ఎదుర్కొంటున్న నాగాలాండ్ ముఖ్యమంత్రి షుర్హోజెలీ లీజీట్సు బుధవారం అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్షకు డుమ్మాకొట్టారు. ఆయన, ఆయన మద్దతుదారులు బలపరీక్షకు హాజరుకాకపోవడంతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఎమ్మెల్యేలు సీఎం లీజీట్సుపై తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రిపై వారు ఎదురుతిరగడంతో గవర్నర్ పీబీ ఆచార్య అసెంబ్లీ వేదిక విశ్వాసపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ఇంటివపాంగ్‌కు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉదయం నిర్వహించిన బలపరీక్షకు మాజీ సీఎం టీఆర్ జెలియంగ్‌తోపాటు ఎన్పీఎఫ్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం లీజీట్సు, ఆయన మద్దతుదారులు మాత్రం రాలేదు. దీంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టకుండానే స్పీకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తూ సైన్ డై చేశారు.