
ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు
అందుకే అందర్నీ చేర్చుకుంటున్నామన్న నారా లోకేశ్
తిరుపతి సిటీ/కడప రూరల్: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని, అందుకే అందర్నీ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నామని టీడీపీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చే నాయకుల్ని స్వాగతించండని, వారిని అడ్డుకోవద్దని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లు ఆధారాలుంటే నిరూపించాలని వైఎస్సార్‌సీపీ నాయకులకు సవాల్ విసిరారు.
బుధవారం తిరుపతిలో కార్యకర్తల శిక్షణ కేంద్రం, కడప టీడీపీ కార్యాలయం వద్ద లోకేశ్ మాట్లాడారు. టీడీపీలో చేరేవారికి ఎవ్వరికీ తాము కమిట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. తమ అధినేత చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై ఎమ్మెల్యేలు చేరుతున్నారని, వారిని వద్దని చెప్పలేం కదా? అని వ్యాఖ్యానించారు.
జగన్‌మోహన్‌రెడ్డి తన చర్యలతో రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ పని అయిపోయిందనిపిస్తున్నారని.. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు వచ్చిందని, ఏడున్నర లక్షల ఓట్లు లభించాయని పేర్కొన్నారు. హెరిటేజ్ ద్వారా అవినీతికి పాల్పడ్డామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.