మీరంతా ఎక్కడికెళ్లారో చెప్పండి: ప్రధాని
మీరంతా ఎక్కడికెళ్లారో చెప్పండి: ప్రధాని
Published Mon, Feb 13 2017 10:13 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
గడిచిన మూడు నెలల్లో కేంద్ర మంత్రులంతా ఎక్కడెక్కడకి వెళ్లారో ఆ వివరాలన్నీ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు తదితర ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా వాళ్లు ఏమైనా ప్రచారం చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోడానికే ఈ వివరాలు కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన మంత్రులకు ఈ విషయం చెప్పారు. సోమవారానికల్లా మొత్తం వివరాలన్నీ ఇవ్వాలని మోదీ ఆదేశించారు.
ఈ వివరాలను అందరు మంత్రుల నుంచి తీసుకుని ప్రధానికి సమర్పించాల్సిన సమన్వయ బాధ్యతలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు అప్పగించారు. గత మూడు నెలల్లో ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏం చేశారన్న వివరాలు చెప్పాలని, ఒకవేళ ఢిల్లీలోనే ఉండి ఎక్కడకూ వెళ్లకపోతే తమ మంత్రిత్వశాఖ కార్యాలయాలకు వెళ్లారో లేదో కూడా చెప్పాలని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పెద్దనోట్ల రద్దుకు మద్దతుగా ప్రచారం చేశారో లేదో తెలుసుకోవాలని ప్రధాని భావిస్తున్నారని, అదే సమయంలో వాళ్లు ఆఫీసు పని, క్షేత్రస్థాయిలో విధుల మధ్య సమన్వయం ఎలా చేసుకుంటున్నారో చూస్తారని అంటున్నారు. దీంతో మొత్తమ్మీద కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవాళ్లలో ఎవరెవరు ఏమేం చేశారన్న వివరాలను ప్రధాని సమీక్షిస్తారని తేలిపోయింది.
Advertisement
Advertisement