
నరేంద్ర మోదీపై ‘తప్పుడు’ ప్రచారమా?
తప్పుడు వార్తలు లేదా వదంతులు ఎంత వేగంగా ట్విట్టర్ లాంటి సోషల్ వెబ్‌సైట్లలో విస్తరిస్తున్నాయో మనకు తెలియందీకాదు.
న్యూఢిల్లీ: తప్పుడు వార్తలు లేదా వదంతులు ఎంత వేగంగా ట్విట్టర్‌లాంటి సోషల్ వెబ్‌సైట్లలో విస్తరిస్తున్నాయో మనకు తెలియందీకాదు. కానీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రపంచ ఉత్తమ ప్రధాన మంత్రిగా యునెస్కో ప్రకటించిందన్న తప్పుడు వార్త సోషల్ వెబ్‌సైట్లలో హల్‌చల్ చేసినంతగా మరే వార్త హల్‌చల్ చేయలేదేమో!
‘ఇదిగో ఇప్పుడే అందిన వార్త. మన ప్రధాని మోదీకి ప్రపంచ ఉత్తమ పీఎం అనే అవార్డు యునెస్కో నుంచి దక్కింది’ అంటూ ఎవరో ఇచ్చిన తప్పుడు సందేశానికి వేలాది మంది నమ్మడం, అందుకు స్పందించడం చూస్తే గుర్రెల మంద సామెత గుర్తురాక మానదు. యునెస్కో వద్ద అలాంటి అవార్డు ఏదీ లేదనే విషయంగానీ, ఇంతవరకు ప్రపంచంలో ఎవరికి కూడా అలాంటి అవార్డు ఇవ్వలేదన్న అంశంగాని తెలియకపోవడం సంగతి పక్కన పెడితే కనీసం క్రాస్‌చెక్ చేసుకోవాలన్న ఆలోచన కూడా రాకపోవడం యూజర్ల బాధ్యతా రహితమే అవుతుంది.
ఆఖరికి అంతర్జాతీయ బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కూడా నమ్మారంటే ఆశ్చర్యం వేస్తోంది. ఆయనలాగే శుక్రవారం నాడు సంచలనం సృష్టించిన ఈ వార్తకు వేలాది మంది స్పందించి ఓ భారతీయుడిగా మనమంతా గర్వపడాల్సిన వార్తని, షేర్ చేసుకోవాల్సిన వార్తని యూజర్లు వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఇలాంటి తప్పుడు వార్తలను తనిఖీ చేసి సకాలంలో వాటిని తొలగించేందుకు ట్విట్టర్ నిర్వాహకులు కూడా ప్రయత్నించక పోవడం మరింత శోచనీయం.
యూజర్లు తమ పొరపాటును గ్రహించాక కూడా వారిలో తప్పు చేశామన్న పశ్చాత్తాపం సంగతి పక్కన పెడితే అయ్యో పొరపాటు చేశామన్న కించుత్తు బాధ కూడా వ్యక్తం చేయకపోవడం బాధ్యతారాహిత్యమే. కాకపోతే వారు తమ తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా ఇప్పుడు ట్విట్టర్‌లో మోదీపై వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.
‘నరేంద్ర మోదీకి ప్రపంచ ఉత్తమ పర్యాటక ప్రధాన మంత్రి అవార్డు ఇవ్వాలి.....మోదీకి ప్రపంచ ఉత్తమ పీఎం అవార్డు వచ్చినప్పుడు, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు బతికున్న ప్రపంచ సెక్సియెస్ట్ మేన్‌గా అవార్డు దక్కాలి....బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు ఉత్తమ పీఎం సహాయ నటుడి అవార్డు రావాలి....’ అంటూ యూజర్లు తమదైన శైలిలో వ్యంగోక్తులు విసురుతున్నారు.
నరేంద్ర మోదీకి సంబంధించిగానీ, భారత్‌కు సంబంధించిగా తప్పుడు వార్తలు లేదా వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించడం ఇదే మొదటిసారి కాదు. 2014లో కూడా మోదీకి ప్రపంచ ఉత్తమ ప్రధాని అన్న అవార్డును యునెస్కో ప్రకటించినట్లు ప్రచారమైంది. ఎందుకోగానీ అప్పుడు ఈ ప్రచారానికి అంతగా ప్రాచుర్యం లభించలేదు. ఆ తర్వాత ఇటీవలి కాలంలో భారత జాతీయ గీతం ‘జన గణ మన అధినాయక జయహే’కు ప్రపంచ ఉత్తమ జాతీయ గీతంగా యునెస్కో అవార్డు లభించిందన్న తప్పుడు వార్తకు కూడా బాగానే ప్రచారం లభించింది. ఈ వార్తను ఎంతో మంది విద్యావంతులు కూడా ఇప్పటికీ విశ్వసిస్తుండడం అన్నింటికన్నా ఆశ్చర్యకరం!