'మోడీ ఓ హిట్లర్, ఎప్పటికి ప్రధాని కాలేడు'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హిట్లర్ లాంటి వాడు అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయాలని తహతహలాడుతున్న మోడీ కలలు కలలుగానే మిగిలిపోతాయి అని నితీశ్ తీవ్రస్థాయిలో మోడీకి కౌంటర్ ఇచ్చారు.
జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చిన నితీశ్ వెన్నుపోటుదారుడు, మోసగాడు అని పాట్నాలో జరిగిన హుంకార్ ర్యాలీలో మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పాట్నా ర్యాలీ జరిగిన రెండు రోజుల తర్వాత మోడీ చేసిన ఆరోపణలకు నితీశ్ జవాబిచ్చారు. ప్రధాని పదవికోసం ఆశపడుతున్న ఓ వ్యక్తి చరిత్రను తెలుసుకోవాలని.. మాట్లాడే భాషను మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
జేపీ సిద్దాంతాలకు నేనెప్పుడూ వదిలలేదు..ఒకవేళ అలా చేస్తే మోడీ నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాస కోసం జేపీ, లోహియాలను తన ప్రసంగంలో ఉపయోగించుకున్నాడని నితీశ్ ఎద్దేవా చేశారు. తన సిద్దాంతాలను బీజేపీ ఎప్పుడో విడిచిపెట్టింది అని ఆయన విమర్శించారు.