చంద్రబాబుకు ప్రధానే లీక్ చేశారేమో! | narendra modi might have told chandra babu about special status, says mekapati rajamohana reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ప్రధానే లీక్ చేశారేమో!

Published Mon, Aug 1 2016 2:27 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

చంద్రబాబుకు ప్రధానే లీక్ చేశారేమో! - Sakshi

చంద్రబాబుకు ప్రధానే లీక్ చేశారేమో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమన్న విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే లీక్ చేసి ఉంటారని వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహనరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం నాడు న్యూఢిల్లీలో పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. వాజ్‌పేయి ప్రభుత్వం పదవీకాలం అయిపోయిన తర్వాత బీజేపీతో కలవడం తాను చేసిన పెద్ద బ్లండర్ అని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు కూడా అలాగే చేసే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు. రేపు యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందితే చంద్రబాబు బీజేపీతో పొత్తును ఎన్నాళ్లు కొనసాగిస్తారో చెప్పలేమని తెలిపారు.

ఎన్నికల సమయంలో రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఆ తర్వాత హోదా ఏమీ సంజీవని కాదని స్వరం మార్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం లోక్సభలో తాము వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తుంటే.. టీడీపీ వాళ్లు మాత్రం తమ స్థానాల్లో నిలబడి చిత్తశుద్ధి లేకుండా డ్రామాలు ఆడారని మండిపడ్డారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ స్పష్టంగా ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పిన తర్వాత కూడా ప్రజల మూడ్‌ను బట్టి చంద్రబాబు స్పందించాలనుకున్నారని, ప్రజలు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారని ఆయన అన్నారు. టీడీపీ, బీజేపీలను బంగాళాఖాతంలో కలిపేయాలని వాళ్లకు ఉందన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాతే చంద్రబాబు కాస్తంత స్వరం మార్చి.. జైట్లీ చెప్పింది చాలా బాధాకరంగా ఉందని అంటున్నారని విమర్శించారు. ఇవన్నీ చిత్తశుద్ధి లేని మాటలని, మోదీ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని మేకపాటి చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ బంద్కు పిలుపునిచ్చారని, దానికి వామపక్షాలు సహా అందరూ మద్దతిస్తున్నారని తెలిపారు. ఈ బంద్‌ జరిగే తీవ్రతను బట్టే ప్రజల ఆకాంక్ష ఎంతగా ఉందో తెలుస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో బాబు కేవలం ప్రత్యేక హోదా గురించే కాక రుణమాఫీ, ఉద్యోగాలు.. ఇలా చాలా చెప్పారని, 600కు పైగా వాగ్దానాలు చేసి, ఏవీ నెరవేర్చకుండా వదిలేశారని ఆయన అన్నారు. ప్రజానాయకుడు ప్రజలను మోసపుచ్చడం సబబు కాదని, ఏపీ ప్రజలు దీన్ని సహించరని స్పష్టం చేశారు. తాము మాత్రం ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తామని, తమవల్ల అవుతుందో లేదో తెలియదు గానీ, రాష్ట్ర బాగోగుల కోసం ఈ పోరాటం చేస్తాని తెలిపారు.
 

నాటకాలు ఆడుతున్నారు: వైవీ సుబ్బారెడ్డి

తాము వెల్‌లోకి వెళ్లి గొడవ చేసిన తర్వాత కూడా వాళ్లు వెల్‌లోకి రాకుండా ప్లకార్డులు పట్టుకుని నాటకాలు ఆడుతున్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీలో ఉన్నవాళ్లు ప్లకార్డులు పట్టుకోవాల్సిన అవసరం ఏముందని, వాళ్లు కేవలం డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. తాము మాత్రం ఈ పార్లమెంటు సమావేశాలు అయ్యేవరకు పార్లమెంటు లోపల, బయట పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  లోక్‌సభలో కూడా ప్రైవేటు బిల్లు పెట్టామని, కానీ అది ఈ సమావేశాల్లో చర్చకు వస్తుందో లేదో చెప్పలేమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement