మీడియాపై నరేంద్ర మోడీ నిష్టూరం
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మీడియాపై నిష్టూరమాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మీడియా ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. మీడియా ప్రతినిధులు ఢిల్లీకే పరిమితం కాకుండా ఆవల కూడా దృష్టిసారించాలని మోడీ పేర్కొన్నారు. బీజేపీ పాలిత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నిరాండబరంగా ఉంటారని, మీడియా మాత్రం కేజ్రీవాల్కు ఇచ్చినంత ప్రాధాన్యం పారికర్కు ఇవ్వలేదని చెప్పారు.
'పారికర్ ఢిల్లీలో ఉన్నట్టయితే పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన ఉన్నత విద్యావంతుడు. నిరాడంబరుడు. ఈ విషయం దేశ ప్రజలందరూ తెలుసుకోవాలి. కానీ మీడియా మాత్రం ఢిల్లీ దాటి బయట చూడటం లేదు' అని మోడీ అన్నారు. మీడియా ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్కు అమిత ప్రాధాన్యమిస్తోందన్నారు. మీడియా తన పట్ల వ్యతిరేకంగా వ్యవహరించినా ప్రజల హృదయాల్ని గెలుచుకోగలిగానని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఎలెక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విజేతగా నిలవాలని ప్రయత్నించలేదని, అయితే ప్రజల మనసు గెలుచుకున్నానని మోడీ వ్యాఖ్యానించారు.