
వ్యోమగాములూ గాఢనిద్రలోకి..!
మన మంగళ్‌యాన్(మామ్) ఉపగ్రహం ఇటీవలే అంగారకుడిని చేరింది. అందుకు 300 రోజులు.. 66 కోట్ల కి.మీ. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. మరికొన్నేళ్లలోనే మనుషులనూ అక్కడికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నందున.. మానవ సహిత అంగారకయాత్రకూ దాదాపు 9 నెలలు పడుతుంది. అందుకే.. మనుషులను సులభంగా, తక్కువ ఖర్చుతో మార్స్‌పైకి పంపడం ఎలా? అని ఆలోచిస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు.. జంతువుల మాదిరిగా వ్యోమగాములనూ కొన్ని రోజుల పాటు గాఢనిద్రలోకి పంపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు! శీతాకాలంలో పలు జంతువులు గాఢనిద్రలోకి వెళ్లి స్తబ్దుగా ఉండిపోతాయి. దీంతో వాటి జీవక్రియలు మందగించి గాఢనిద్రలో ఉన్నన్ని రోజులూ బయటి నుంచి ఆహారం, నీరు తీసుకోవాల్సిన అవసరం తప్పిపోతుంది. అలాగే వ్యోమగాములనూ గాఢనిద్రలోకి పంపితే.. ఆహారం, నీటి అవసరాలు మూడు రెట్లు తగ్గడంతో పాటు యాత్రలో వారి ఇతర అవసరాలు, నిర్వహణ వ్యయం కూడా బాగా తగ్గిపోతాయని భావిస్తున్నారు.
మెదడుకు గాయాలైన రోగులను వారం రోజుల పాటు గాఢనిద్రలోకి పంపే పద్ధతిని వైద్యరంగంలో ఇదివరకే మొదలుపెట్టేశారు. అన్నట్టూ.. అందరూ నిద్రలోకి జారుకుంటే.. వ్యోమనౌక నియంత్రణ, భూమిపై కంట్రోల్ రూంతో సంప్రదింపులు కష్టం కాబట్టి.. ఎల్లప్పుడూ ఒకరు మేలుకుని ఉండేలా షెడ్యూలు రూపొందిస్తారట.