ప్రైవేటు నౌకలతో ప్రమాదం | Navy has much better maritime awareness: ShekharSinha | Sakshi
Sakshi News home page

ప్రైవేటు నౌకలతో ప్రమాదం

Published Wed, Dec 4 2013 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

Navy has much better maritime awareness: ShekharSinha

‘ముంబై’ తరహా దాడులకు అవకాశం  
 నౌకాదళ ప్రధానాధికారి ఆందోళన

 
న్యూఢిల్లీ: సముద్ర జలాల్లో రవాణా నౌకలకు రక్షణ కల్పించే కొన్ని దేశాలకు చెందిన ప్రైవేటు సాయుధ బలగాల వల్ల దేశ భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి హెచ్చరించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ బలగాలున్న నౌకల నియంత్రణకు సరైన విధానమంటూ లేదని, వాటి వల్ల ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటం, ముంబై తరహా దాడులకు పాల్పడటం వంటివి జరగొచ్చని జోషి ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి నౌకలు 140కి పైగా ఉన్నాయన్నారు. ‘ఆ నౌకల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉంటాయి. వాటిని ఎక్కడికి, ఎవరి కోసం తీసుకెళ్తున్నారో తెలియదు. ఇది చాలా ఆందోళనకర విషయం’ అన్నారు. తమిళనాడులోని ట్యూటికొరన్ తీరంలో అమెరికన్ నౌక ‘సీమెన్‌గార్డ్ ఓహియో’ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

 

కొన్ని దేశాలు ప్రైవేటు సాయుధ గార్డులుగా కొందరిని తాత్కాలికంగా నియమించుకుంటున్న విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. రవాణా నౌకల నియంత్రణకు అంతర్జాతీయ మారిటైమ్ సంస్థ ఉన్నట్లుగానే ఆ సాయుధ బలగాలున్న నౌకలకు కూడా నియంత్రణ వ్యవస్థ ఉండాలని, అందుకు సముద్ర తీర దేశాలన్నీ కృషి చేయాలని జోషి సూచించారు. ఆ నౌకల వివరాలు, అందులోని గార్డులు, ఆయుధాల సంఖ్య మొదలైనవన్నీ సంబంధిత దేశాలకు తెలియజేయాలన్నారు. సముద్రదొంగల ప్రమాదం అధికంగా ఉన్నప్రాంతాల్లో రవాణా నౌకల ప్రయాణాన్ని కూడా నిరోధించాలన్నారు. దక్షిణ శ్రీలంకకు దగ్గరగా ప్రయాణించాల్సిన నౌకలు భారతదేశ తీరానికి దగ్గరగా వెళ్తున్నాయని, ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement