
నాజీ బంగారు రైలు లభ్యం?
లండన్: ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తుపాకులు, భారీ బంగారు నిధితో మాయమైన నాజీ రైలు ఒకటి దొరికినట్లు ఇద్దరు నిధుల వేటగాళ్లు ప్రకటించారు. 1945లో జర్మన్ నుంచి హంగేరీ వెళ్తున్న ఈ రైల్లో భారీఎత్తున తుపాకులు, పారిశ్రామిక పరికరాలు, వజ్రాలు, టన్నుల కొద్దీ బంగారం, ఇతర అమూల్యమైన వస్తువులు, చిత్రపటాలు ఉన్నట్లు చెప్తున్నారు. వీటి విలువ దాదాపు రూ.13 వందల కోట్ల విలువ ఉంటుందని అంచనా.
పోలండ్‌లోని కొన్ని వెబ్‌సైట్ల కథనం ప్రకారం ఈ రైలులో 300 టన్నుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. 150 మీటర్ల పొడవున్న ఈ రైలు 1945లో అదృశ్యమైంది. పోలండ్‌లోని దిగువ సిలేసియన్‌లో ఓ సొరంగ మార్గంలో ప్రవేశించిన తరువాత రైలు అందులోంచి బయటకు రాలేదని భావిస్తున్నారు. తరువాతి కాలంలో ఆ సొరంగ మార్గా న్ని మూసేశారు.
పోలండ్, జర్మనీలకు చెందిన ఇద్దరు నిధి వేటగాళ్లు తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ న్యాయసంస్థ ద్వారా పోలండ్‌లోని ఆగ్నేయ జిల్లా వాల్‌బ్రిక్ అధికారులను సంప్రదించారు. దొరికిన మొత్తంలో 10శాతం తమకు ఇస్తే నిధిని అప్పగిస్తామని ప్రతిపాదించారు. అధికారులు ఈ వ్యవహారాన్ని విచారిస్తున్నారు.