Nazi gold train
-
బంగారు రైలు దొరుకుతుందా?
-
బంగారు రైలు దొరుకుతుందా?
వాల్ బ్రిచ్: నాజీల బంగారు రైలు కోసం మళ్లీ వేట మొదలైంది. నైరుతి పోలెండ్ లోని ఓ పట్టణంలో భూస్థాపితం అయిందని భావిస్తున్న రైలులో భారీగా బంగారం, వజ్రాలు ఉన్నట్లు ట్రెజర్ హంటర్లు అంటున్నారు. అయితే ఇందుకు శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. దీనిపై ట్రెజర్ హంటర్ల ప్రతినిధి మాట్లాడుతూ.. కచ్చితంగా రైలును గుర్తించి తీరుతామని అన్నారు. గత ఏడాది ఆగస్టులో పోలెండ్ కు దగ్గరలో నాజీల రైలుకు చెందిన ఆనవాళ్లను భూగర్భ రాడార్ ద్వారా గుర్తించామని ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో ఒక్కసారిగా ట్రెజర్ ట్రైన్ ను గురించిన వార్తలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చాయి. దాదాపు 98 మీటర్ల పొడవు కలిగిన రైలు గుర్తులు భూమికి 26 నుంచి 28 అడుగుల లోతు లోపల ఉన్నట్లు వారు పేర్కొన్నారు. రైలులోపల ఎక్కువగా ఆయుధాలకు సంబంధించిన వస్తువులు ఉన్నట్లు చెప్పారు. కళాఖండాలు, బంగారు ఆభరణాలు, నాజీలు దోచుకున్న బంగారం తదితరాలతో రైలు నిండిపోయి ఉందని తెలిపారు. ఈ వార్తలపై అధ్యాయనం చేసిన ఏజీహెచ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భూగర్భ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో అలాంటి ఆనవాళ్లేమీ లేవన్నారు. అక్కడ సొరంగం ఉండే అవకాశం ఉందని చెప్పారు. రష్యన్ ఆర్మీ నుంచి తప్పించుకునేందుకు నాజీలు అప్పట్లో సొరంగాలను నిర్మించినట్లు చెప్పారు. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా, నాజీల రైలు కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. సొరంగ మార్గాన్ని గుర్తించినా అది తాము సాధించిన విజయమే అవుతుందని వారు అంటున్నారు. సొరంగం లోపల రైలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. వచ్చే గురువారం లోపు రైలు గురించిన రహస్యం బట్టబయలవుతుందని చెప్పారు. -
బంగారం నింపిన రైలును నిజంగా పాతిపెట్టారా?
బెర్లిన్: ఎప్పుడో నాజీల నాటి రోజుల్లో.. బంగారంతో నింపిన ఓ రైలును భూగర్బంలో పాతిపెట్టి దాచి ఉంచారని జానపదులు చెప్పుకునే మాటలు విని కొందరు గుప్త నిధుల వేటగాళ్లు చెమటోడుస్తున్నారు. రోజుల తరబడి దానికోసం గాలింపులు చేపట్టి చివరకు ఆ ప్రాంతాన్ని గుర్తించి ప్రత్యేక తవ్వకాలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే, వారు వెతికిన ఆ చోట ఓ సొరంగ మార్గమైతే కనిపించిందికానీ, రైలు మాత్రం అందులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆ వెతికే వారితోపాటు పనిచేస్తున్న నిపుణులు తెలిపారు. పియోర్ కోపర్, ఆండ్రెస్ రిచ్టెర్ అనే ఇద్దరు వ్యక్తులు తమ హంటింగ్ కు సంబంధించిన విశేషాలు తెలియజేశారు. పోలాండ్ లోని వాల్బ్రిక్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఓ వంతెన వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం సమయంలో యుద్ధంలో తలమునకలైన నాజీలు తమ భవిష్యత్తు అవసరాలకోసం బంగారంతో నింపిన ఓ రైలును సొరంగంలో ఎవరికి కనిపించకుండా పాతిపెట్టి ఉంచారని కథలుకథలుగా అక్కడ జానపదులు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. నిజంగానే ఆ ప్రాంతంలో ఏదో దాచి ఉంచబడిందనే చెప్పే కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా లభ్యం అయ్యాయి. అయితే, అది బంగారు రైలే అని మాత్రం స్పష్టంగా తెలియదు. అయినా, ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నారేమో ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పరిశీలనలు జరిపారు. ఆ ప్రాంతం మొత్తాన్ని రాడార్ల సహాయంతో స్కానింగ్ చేయగా అక్కడ ఓ టన్నెల్ లాంటిది ఉందని తెలిసింది. అయితే, అందులో రైలు ఉన్నట్లు ఆధారాలు మాత్రం ఇప్పటివరకు లభించలేదట. మరోపక్క, ఇదే విషయాన్ని చెప్పేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఒక బృందమేమో తమ బంగారంతో నింపిన రైలు ఉన్నట్లు తోచడం లేదని చెప్పగా మరో బృందం మాత్రం 1945లో సోవియెట్ రెడ్డ్ ఆర్మీ కంటపడకుండా ఉండేందుకు నాజీలు బంగారంతో నింపిన రైలు పెట్టెలను సొరంగంలో పాతిపెట్టారని ఇప్పటికీ జానపదులు చెప్పుకుంటారని, తాము ఆ విషయాన్ని నమ్ముతున్నామని, ఏదేమైనా ఆ సొరంగంలో గాలింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే, వారి నమ్మకం నిజమే అయ్యి బంగారు రైలు దొరుకుతుందేమో వేచి చూడాల్సిందే. -
మరి బంగారం అంటే మాటలా...!
వార్సా: పోలండ్‌లోని వాల్‌బ్రిజిక్ నగరంలో పక్షం రోజులుగా వ్యాపారం జోరుగా సాగుతోంది. తినుబండారాల నుంచి టీ షర్టులు, మగ్గులు, ప్లేట్ల వరకు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వాల్‌బ్రిజిక్ నగరం పేరు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పోవడమే అందుకు కారణం. నాజీల కాలంలో అపార బంగారు రాశులతో కూడిన రైలును దాచిన సొరంగ మార్గాన్ని కనుగొన్నామంటూ జర్మన్‌కు చెందిన ఆండ్రియాస్ రిచ్టర్, పోల్ పాయిటర్ కోపర్ ప్రకటించడం, ఆ వార్తా దావానంలా ప్రపంచాన్నంతా చుట్టేసిన విషయం తెల్సిందే. ఈ వార్తను ఎలా సొమ్ము చేసుకోవాలా ? అన్న అలోచన వచ్చిన ఓ వ్యాపారి ‘ఇండియానా జోన్స్’ తరహాలో సొరంగ మార్గం గుండా బంగారు రాశులతో దూసుకొస్తున్న రైలు బొమ్మను టీ షర్టులపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. వాటి అమ్మకాలు హఠాత్తుగా పెరిగిపోవడంతో ఆయన్నే ఇతర వ్యాపారులు అనుసరించారు. అలాంటి బొమ్మలనే టీ మగ్గులపై, ప్లేట్లపై ముద్రించడంతో వాటి అమ్మకాలు కూడా పెరిగాయి. తామేమి తక్కువ తినలేదంటూ తినుబండారాల తయారీదారులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. చాకోబార్లకు ‘గోల్డ్ బార్స్ ఫ్రమ్ ది ఆర్మర్డ్ ట్రెయిన్’ అనే టైటిల్స్ కూడా వాటికి తగిలించేశారు. సొరంగంలో నాజీలు దాచిన బంగారం రైలును తాము కనుగొన్నామని, తమకు అందులో కొంత వాటా ఇస్తామంటే చెబుతామంటూ పోలాండ్ పోలీసు అధికారుల ముందుకు వచ్చిన ఆండ్రియాస్, పోల్ పాయిటర్లు మాత్రం జైలు కూడు తింటున్నారు. ఫలానా చోట రైలుందంటూ వారు చూపించిన శాటిలైట్ ఛాయా చిత్రాలు కంప్యూటర్ గ్రాఫిక్స్‌గా అనుమానించి వారిని పోలీసు అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే వారి మాటల్లో నిజం లేకపోలేదని, వారు చెబుతున్న వాల్‌బ్రిజిక్ నగరానికి సరిగ్గా 12 మైళ్ల దూరంలోని వాలిమ్ అనే గ్రామం వద్ద బంగారు రైలు దాచినట్టుగా భావిస్తున్న సొరంగాన్ని 1926 నాటి రైల్వే మ్యాప్ ద్వారా పోలండ్అధికారులు కనుగొన్నారని స్థానిక ‘గజెటా రొక్లావస్కా’ అనే పత్రిక మంగళవారం సాయంత్రం వెల్లడించింది. ప్రస్తుతం ఉపయోగంలో లేని ఆ రైలు సొరంగంలో తవ్వకాలు జరుపుతారా? అని పోలండ్ పురావస్తు శాఖాధికారులను ప్రశ్నించగా, ప్రభుత్వం నుంచి తమకు అధికారికంగా ఉత్తర్వులు వస్తే ముందుగా అక్కడ అధ్యయనం జరుపుతామని, అవసరమైతే తవ్వకాలు జరుపుతామని వారు చెప్పారు. ఇలాంటి వార్తల కారణంగా వాల్‌బ్రిజిక్ నగర పరిసరాల్లో జన సంచారం కూడా పెరుగుతోందని, వారి కారణంగా తమ వ్యాపారం మాత్రం బంగారంలా మెరిసిపోతోందని వ్యాపార వర్గాలు ఆనందంతో మురిసి పోతున్నారు. మరి, బంగారం అంటే మాటలా! -
నాజీ బంగారు రైలు లభ్యం?
లండన్: ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తుపాకులు, భారీ బంగారు నిధితో మాయమైన నాజీ రైలు ఒకటి దొరికినట్లు ఇద్దరు నిధుల వేటగాళ్లు ప్రకటించారు. 1945లో జర్మన్ నుంచి హంగేరీ వెళ్తున్న ఈ రైల్లో భారీఎత్తున తుపాకులు, పారిశ్రామిక పరికరాలు, వజ్రాలు, టన్నుల కొద్దీ బంగారం, ఇతర అమూల్యమైన వస్తువులు, చిత్రపటాలు ఉన్నట్లు చెప్తున్నారు. వీటి విలువ దాదాపు రూ.13 వందల కోట్ల విలువ ఉంటుందని అంచనా. పోలండ్‌లోని కొన్ని వెబ్సైట్ల కథనం ప్రకారం ఈ రైలులో 300 టన్నుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. 150 మీటర్ల పొడవున్న ఈ రైలు 1945లో అదృశ్యమైంది. పోలండ్‌లోని దిగువ సిలేసియన్లో ఓ సొరంగ మార్గంలో ప్రవేశించిన తరువాత రైలు అందులోంచి బయటకు రాలేదని భావిస్తున్నారు. తరువాతి కాలంలో ఆ సొరంగ మార్గా న్ని మూసేశారు. పోలండ్, జర్మనీలకు చెందిన ఇద్దరు నిధి వేటగాళ్లు తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ న్యాయసంస్థ ద్వారా పోలండ్‌లోని ఆగ్నేయ జిల్లా వాల్బ్రిక్ అధికారులను సంప్రదించారు. దొరికిన మొత్తంలో 10శాతం తమకు ఇస్తే నిధిని అప్పగిస్తామని ప్రతిపాదించారు. అధికారులు ఈ వ్యవహారాన్ని విచారిస్తున్నారు.