
మరి బంగారం అంటే మాటలా...!
వార్సా: పోలండ్‌లోని వాల్‌బ్రిజిక్ నగరంలో పక్షం రోజులుగా వ్యాపారం జోరుగా సాగుతోంది. తినుబండారాల నుంచి టీ షర్టులు, మగ్గులు, ప్లేట్ల వరకు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వాల్‌బ్రిజిక్ నగరం పేరు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పోవడమే అందుకు కారణం. నాజీల కాలంలో అపార బంగారు రాశులతో కూడిన రైలును దాచిన సొరంగ మార్గాన్ని కనుగొన్నామంటూ జర్మన్‌కు చెందిన ఆండ్రియాస్ రిచ్టర్, పోల్ పాయిటర్ కోపర్ ప్రకటించడం, ఆ వార్తా దావానంలా ప్రపంచాన్నంతా చుట్టేసిన విషయం తెల్సిందే.
ఈ వార్తను ఎలా సొమ్ము చేసుకోవాలా ? అన్న అలోచన వచ్చిన ఓ వ్యాపారి ‘ఇండియానా జోన్స్’ తరహాలో సొరంగ మార్గం గుండా బంగారు రాశులతో దూసుకొస్తున్న రైలు బొమ్మను టీ షర్టులపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. వాటి అమ్మకాలు హఠాత్తుగా పెరిగిపోవడంతో ఆయన్నే ఇతర వ్యాపారులు అనుసరించారు. అలాంటి బొమ్మలనే టీ మగ్గులపై, ప్లేట్లపై ముద్రించడంతో వాటి అమ్మకాలు కూడా పెరిగాయి. తామేమి తక్కువ తినలేదంటూ తినుబండారాల తయారీదారులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. చాకోబార్లకు ‘గోల్డ్ బార్స్ ఫ్రమ్ ది ఆర్మర్డ్ ట్రెయిన్’ అనే టైటిల్స్ కూడా వాటికి తగిలించేశారు.
సొరంగంలో నాజీలు దాచిన బంగారం రైలును తాము కనుగొన్నామని, తమకు అందులో కొంత వాటా ఇస్తామంటే చెబుతామంటూ పోలాండ్ పోలీసు అధికారుల ముందుకు వచ్చిన ఆండ్రియాస్, పోల్ పాయిటర్‌లు మాత్రం జైలు కూడు తింటున్నారు. ఫలానా చోట రైలుందంటూ వారు చూపించిన శాటిలైట్ ఛాయా చిత్రాలు కంప్యూటర్ గ్రాఫిక్స్‌గా అనుమానించి వారిని పోలీసు అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే వారి మాటల్లో నిజం లేకపోలేదని, వారు చెబుతున్న వాల్‌బ్రిజిక్ నగరానికి సరిగ్గా 12 మైళ్ల దూరంలోని వాలిమ్ అనే గ్రామం వద్ద బంగారు రైలు దాచినట్టుగా భావిస్తున్న సొరంగాన్ని 1926 నాటి రైల్వే మ్యాప్ ద్వారా పోలండ్‌అధికారులు కనుగొన్నారని స్థానిక ‘గజెటా రొక్లావస్కా’ అనే పత్రిక మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
ప్రస్తుతం ఉపయోగంలో లేని ఆ రైలు సొరంగంలో తవ్వకాలు జరుపుతారా? అని పోలండ్ పురావస్తు శాఖాధికారులను ప్రశ్నించగా, ప్రభుత్వం నుంచి తమకు అధికారికంగా ఉత్తర్వులు వస్తే ముందుగా అక్కడ అధ్యయనం జరుపుతామని, అవసరమైతే తవ్వకాలు జరుపుతామని వారు చెప్పారు. ఇలాంటి వార్తల కారణంగా వాల్‌బ్రిజిక్ నగర పరిసరాల్లో జన సంచారం కూడా పెరుగుతోందని, వారి కారణంగా తమ వ్యాపారం మాత్రం బంగారంలా మెరిసిపోతోందని వ్యాపార వర్గాలు ఆనందంతో మురిసి పోతున్నారు. మరి, బంగారం అంటే మాటలా!