పెన్షన్... ఎలా కావాలంటే అలా..
పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే తగినంత రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవాలి. ఇందుకు బీమా పథకాలు సరైనవి. బీమా కంపెనీలు అందించే పథకాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఇమీడియెట్ పెన్షన్, డిఫర్డ్ పెన్షన్ ప్లాన్స్. ఇందులో ఇమీడియెట్ పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నుంచి పెన్షన్ రావడం మొదలవుతుంది. అదే డిఫర్డ్ యాన్యుటీ తీసుకుంటే ఒక పరిమిత కాలానికి ఇన్వెస్ట్ చేసు కుంటూ పోతే కాలపరిమితి తీరిన తర్వాత పెన్షన్ రావడం మొదలవుతుంది. ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న సమయంలో ఆ మొత్తంపై సెక్షన్ 80సీ ప్రకారం పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. డిఫర్డ్ యాన్యుటీ పథకాల్లో కాలపరిమితి తీరిన తర్వాత అవసరమైతే గరిష్టంగా మూడో వంతు మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తం యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు పథకాల్లో దేనిని ఎంచుకున్నా చేతికి వచ్చే పెన్షన్ మాత్రం మీరు ఎంచుకున్న యాన్యుటీ పథకంపైనే ఆధారపడి ఉంటుంది. బీమా కంపెనీలు అనేక రకాల యాన్యుటీ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
జీవిత కాలం పెన్షన్: పాలసీదారుడు జీవించినంత కాలం పెన్షన్ వస్తుంది. మరణానంతరం ఆగిపోతుంది. ఇక నామినీలకు ఎటువంటి చెల్లింపులు ఉండవు. అందుకే ఈ ఆప్షన్ ఎంచుకుంటే మిగిలిన వాటికంటే పెన్షన్ ఎక్కువ లభిస్తుంది.
నామినీకి కావాలంటే: ఇన్వెస్ట్ చేసిన మొత్తం నామినీకి రావడమే కాకుండా జీవిత కాలం పెన్షన్ వచ్చే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని ఎంచుకుంటే పాలసీదారుడు మరణించే వరకు పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత నామినీకి ఇన్వెస్ట్ చేసిన మొత్తం వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. కాని పై ఆప్షన్‌తో పోలిస్తే ఈ ఆప్షన్‌లో నెలవారీ అందుకునే పెన్షన్ మొత్తం తగ్గుతుంది.
పరిమిత కాలానికి పెన్షన్: జీవిత కాలం కాకుండా ముందుగా నిర్దేశించుకున్న కాలానికి పెన్షన్ లభించే విధంగా కూడా ఎంచుకోవచ్చు. ఇందులో కాలపరిమితి తీరిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉన్నా పెన్షన్ రాదు. అలా కాకుండా ఎంచుకున్న కాలపరిమితి లోపే పాలసీదారుడు మరణిస్తే కాలపరిమితి ముగిసేవరకు నామినీకి పెన్షన్ లభిస్తుంది.
జీవిత భాగస్వామికి: పాలసీదారుడు జీవించినంత కాలం పెన్షన్ రావడమే కాకుండా మరణం తర్వాత తనపై ఆధారపడిన జీవిత భాగస్వామికి పెన్షన్ లభించే యాన్యుటీ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఐసీఐసీఐ కార్బన్ క్రెడిట్ కార్డు
ఆన్‌లైన్ లావాదేవీలపై ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా పూర్తి సురక్షితమైన అధునాతన టెక్నాలజీతో కూడిన క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ ప్రవేశపెట్టింది. ‘కార్బన్’ పేరుతో విడుదల చేసిన ఈ కార్డు వీసా కోడ్‌సెక్యూర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. కార్డు వెనుక భాగంలో ఆల్ఫాన్యూమరిక్ ఎల్‌సీడీ స్క్రీన్, 12 అంకెల టచ్ బటన్ కీప్యాడ్, పవర్ బటన్స్ ఉంటాయి. ఈ కార్డును ఉపయోగించే ముందు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్‌లో కోడ్ సెక్యూర్ పిన్‌ను పొందాలి. ఈ కోడ్ సెక్యూర్ పిన్‌ను వినియోగించి వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను జనరేట్ చేయడం ద్వారా కార్డుపై లావాదేవీలు జరుపుకోవచ్చు.
యూబీఐలో రెలిగేర్ పాలసీలు
యూనియన్ బ్యాంకులో రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను విక్రయించే విధంగా ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన వైద్య బీమా పథకాలు యూనియన్ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి.