1972 నాటి గాయాలకు నేడు చికిత్స
న్యూయార్క్: యుద్ధం వల్ల బాల్యం ఎంత ఛిద్రమవుతుందో ప్రపంచానికి చాటిచెప్పిన ఈ చిత్రం నాడు ప్రపంచాన్నే కుదిపేసింది. చిత్రంలో బట్టలు లేకుండా పరుగెడుతూ కనిపిస్తున్న తొమ్మిదేళ్ల వియత్నాం పాప కిమ్ ఫూనకు నేడు సరిగ్గా 52 ఏళ్లు. నాడు దక్షిణ వియత్నాంలోని ట్రాంగ్ బ్యాంగ్ గ్రామంపై యుద్ధ సేనలు ప్రయోగించిన నాపమ్ బాంబు వల్ల వంటిపై బట్టలు మంట పుట్టడంతో ఆ పాప ఆ బట్టలను ఊడదీసి వీధిలో పరుగెత్తింది. అప్పుడు కాలిన గాయాలు ఇప్పటికీ సల్పుతుంటే బాధను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇక ఆ బాధను భరించలేనంటూ కెనడాలోని టొరాంటోలో నివసిస్తున్న కిమ్ ఫూ ఇటీవల అమెరికాలోని మయామి ఆస్పత్రికి వెళ్లి నాటి గాయాలకు చికిత్స చేయించుకుంటోంది.
ఆమెకు భర్త బీ యూ తొయాన్, ఇద్దరు పిల్లలు, 1972, జూన్ 7వ తేదీన బాంబు దాడి నుంచి తప్పించుకొని వీధిలో పరుగెడుతున్నప్పుడు, కిమ్ ఫూ, ఆమె సోదరుల ఫొటోను తీసిన నాటి లాస్ ఏంజలిస్ ఏపీ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్‌లు తోడుగా ఉన్నారు. అప్పడు, ఆ పాపను వాళ్ల సోదరులను ఏపీ మీడియా వాహనంలోనే సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి వారి ప్రాణాలను రక్షించింది కూడా ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్‌యే. ఈ ఫొటోను తీసిన నిక్ ఉట్‌కు పులిట్జర్ అవార్డు లభించింది. ఇప్పడు ఆయనకు 65 ఏళ్లు ఉన్నాయి. ఆయనను కిమ్ ఫూ ‘మామ’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు.
నాటి బాంబు దాడిలో ఎడమ చేయి, ఎడమ భుజానికి తీవ్ర కాలిన గాయాలయ్యాయని, చికిత్స కోసం పెద్దయ్యాక ఎన్నో ఆస్పత్రులు తిరిగానని, ఎక్కడికెళ్లినా సరైన వ్యాయామం చేయడం ఒక్కటే మార్గమని చెబుతూ వచ్చారని, నేటికి వ్యాయామం చేస్తున్నా గాయాల బాధ తగ్గడం లేదని, ఎడమ చేయి పూర్తిగా ఇప్పటికీ లేవడం లేదని కిమ్ ఫూ తెలిపారు. అమెరికాలోని ‘మయామి డెర్మటాలజీ లేజర్ ఇనిస్టిట్యూట్’లో సరైన చికిత్స ఉందని తెలిసి, తన భర్త, అంకుల్ ఫొటోగ్రాఫర్ సహాయంతో ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నానని, ఒక్కో సెషన్‌కు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్పారు. చావుతోనే తన గాయాల బాధ తీరుతుందని నిన్నటిదాకా భావిస్తూ వచ్చానని, ఏడాదిలోగా ఆ బాధ నుంచి కోలుకుంటాననే ఆశాభావం ఇప్పుడు కలుగుతోందని ఆమె అన్నారు.