లండన్: మనం ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా ప్రాణాంతక వ్యాధి కేన్సర్ ను ముందుగానే ఎందుకు కనిపెట్టడం లేదని చాలాసార్లు భావించే ఉంటాం. ఆదిలోనే ఆ వ్యాధిని కనిపెడితే తగిన వైద్యంతో బయటపడవచ్చనే ఆలోచన కూడా మనకు ఒకసారైనా వచ్చే ఉంటుంది. తాజాగా కేన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించే ఓ పరికరాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనికి గాను ఒక నానో చిప్ పరికరాన్ని స్పెయిన్ కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. కేన్సర్ లక్షణాల కల్గిన వ్యక్తి యొక్క ఒక చుక్క రక్తాన్ని ఆ మైక్రో చిప్ లో ప్రవేశపెట్టి పరీక్ష చేస్తారు. దాంతో కేన్సర్ పై ఒక నిర్దారణకు వచ్చిన తరువాత డాక్టర్లు వైద్యం చేసే వెసులుబాటు ఉంటుందని ప్రొఫెసర్ రొమైన్ కిదాంత్ తెలిపారు. ఇది చాలా సున్నితమైన పరికరమే కాకుండా చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నారు.
మనకు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు శరీరంలో దాగి ఉన్న కేన్సర్ కారకులు దాడికి పాల్పడుతుంటాయి. ఇలా ఈ రకంగా జరిగినప్పుడు శరీరంలోని కణాలు విడిపోయి కేన్సర్ కు దారి తీస్తుంది. అదే మనకు కేన్సర్ సోకిందని ముందుగానే తెలిస్తే.. దానికి తగిన వైద్యంతో ఆ కారకాల్ని నిర్మూలించేందుకు యత్నిస్తాం. ఇప్పటివరకూ కేన్సర్ అనేది మూడో స్టేజ్ లో గాని, నాలుగో స్టేజ్ లో గాని బహిర్గతమవుతూ ఉంటుంది. అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం చాలా తక్కువ. త్వరలో మన ముందు రాబోయే ఈ చిన్నపాటి పరికరం కేన్సర్ నిర్మూలనకు ఎంతగా దోహద పడుతుందో వేచి చూడాలి.