ఇక బాపూజీ బాటలో ఉద్యమం
పటేల్ వర్గానికి ఓబీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించాలంటూ తాను చేస్తున్న పోరాటాన్ని ఇక సూరత్ నుంచి కొనసాగిస్తానని హార్దిక్ పటేల్ చెప్పాడు. పాటీదార్ అనన్మత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్గా వ్యవహరిస్తున్న హార్దిక్.. ఢిల్లీ నుంచి సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నాడు. తన ఉద్యమానికి అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోందని, రాబోయే రోజుల్లో దీన్ని దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తానని చెప్పాడు.
గుజరాత్లో ఉన్న మొత్తం 137 మంది నాయకులతో ఓ సమావేశం ఏర్పాటుచేశామని, రెండో విడత పోరాటానికి కార్యాచరణను అందులోనే ఖరారు చేస్తామని చెప్పాడు. ఈసారి తాలూకా, గ్రామస్థాయిపై దృష్టి పెడతామన్నాడు. ఇది మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గుజరాత్లో తాము ఇకమీదట నిర్వహించే కార్యక్రమాలు, ర్యాలీల గురించి మంగళవారం ప్రకటిస్తామని హార్దిక్ పటేల్ చెప్పాడు. బాపూజీ చూపిన బాటలోనే తమ ఉద్యమం సాగుతుందని అన్నాడు.