సూరత్ నుంచి మలి దశ పోరాటం!
గుజరాతీ పటేళ్ల ‘ఓబీసీ’ ఉద్యమంపై హార్దిక్ పటేల్
అహ్మదాబాద్: గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గాన్ని ఇతర వెనకబడిన కులాల్లో(ఓబీసీ) చేర్చాలన్న డిమాండ్‌తో ప్రారంభమైన తమ ఉద్యమం మలి దశను మంగళవారం సూరత్ నుంచి ప్రారంభించనున్నట్లు ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. ఈ రెండో దశ ఉద్యమం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ఈ దశలో గ్రామ, తాలూకా స్థాయిల్లో కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అహ్మదాబాద్‌లో ఆగస్టు 25న హార్దిక్ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారి, 10 మంది చనిపోవడం తెలిసిందే. ఢిల్లీ నుంచి సోమవారం గుజరాత్ తిరిగొచ్చిన హార్దిక్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ రిజర్వేషన్ పోరాటానికి దేశవ్యాప్తంగా అనేక కులాలు, వర్గాల నుంచి గట్టి మద్దతు లభించిందని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామన్నారు. రెండో దశ ఉద్యమంలో చేపట్టబోయే కార్యక్రమాలను మంగళవారం ప్రకటిస్తామన్నారు.
మహాత్మాగాంధీ చూపిన శాంతి మార్గంలో తమ పోరాటం ఉంటుందన్నారు. తన ఢిల్లీ పర్యటన వివరాలు చెబుతూ.. తమ రిజర్వేషన్ పోరాటానికి గుజ్జర్ వికాస పరిషత్, కుర్మి క్షత్రియ మహాసభ, అంజన చౌదరి సమాజ్, రాష్ట్రీయ గుజ్జర్ మంచ్ తదితర సంస్థలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు ఇచ్చాయన్నారు. ‘గుజ్జర్లు, కుర్మిలు, చౌదరీలు ఇంకా చాలామంది మాతో ఉన్నారు. త్వరలో మా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసి, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.
మా తదుపరి బహిరంగ సభ యూపీలోని లక్నోలో ఉంటుంది’ అని తెలిపారు. పటేల్, గుజ్జర్, కుర్మి సామాజిక వర్గాల జనాభా దాదాపు 27 కోట్లు ఉంటుందని, తమకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ ఆ 27 కోట్లమంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపిస్తామన్నారు. అహ్మదాబాద్‌లో చెలరేగిన హింసకు పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.