
ఆపరేషన్ క్లీన్ మనీ: 9లక్షల ఖాతాలు సందేహాస్పదం
న్యూఢిల్లీ: 'ఆపరేషన్ క్లీన్ మనీ' ప్రక్రియలో ఇటీవల ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్ ల ద్వారా వివరణకు ఇచ్చిన గడువు (ఫిబ్రవరి 15) ముగియడంతో తదుపరి చర్యలకు దిగుతోంది. ఈ మేరకు రద్దయిన నోట్ల డిపాజిట్లపై ఇటీవల గుర్తించిన 18 లక్షల అనుమానాస్పద ఖాతాల్లో దాదాపు సగం ఖాతాలపై ఆదాయపన్ను శాఖ అనుమానాలను వ్యక్తం చేసింది. 9 లక్షల ఖాతాల్లో బ్యాంకు డిపాజిట్లను 'సందేహాస్పదంగా' గుర్తించినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. అయితే కొత్త పన్ను అమ్నెస్టీ పథకం మార్చి 31 న ముగిసిన అనంతరం ఈ ఖాతాలపై చర్యకు దిగనునున్నట్టు ప్రకటించింది.
ఆపరేషన్ క్లీన్ మనీ లో భాగంగా డీమానిటైజేషన్ 50-రోజుల కాలంలో రూ.5 లక్షలకు పైన అనుమానాస్పద డిపాజిట్లపై ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా 18 లక్షలమందిని ఆరాతీసింది. వీరిలో చాలా మంది ఫిబ్రవరి 12దాకా తమకు సమాధానాలు ఇచ్చినట్టు చెప్పింది. అయితే వీటికి సమాధానం చెప్పని ఖాతాదారులు , సరియైన న్యాయపరమైన వివరణ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని ఐటీ వర్గాలు ప్రకటించాయి. తమ నోటీసులకు ప్రత్యుత్తరం పంపనివారికి లేదా ఐటిఆర్ వెల్లడిపై ఉద్దేశపూర్వకంగా కట్టుకథలు చెప్పేవారిపై కచ్చితంగా చర్య తీసుకోబడుతుందన్నాయి. 2016-17 ఆదాయ రిటర్న్స్ తోనే సరిపోలనీ, లేదా గడచిన సంవత్సరాలలో ఆదాయంలో అసాధారణ పెరుగుదల ఉంటే వాటిని అక్రమ ఆస్తులు, లేదా నల్లధనం కింద పరిగణిస్తామని స్పష్టం చేశాయి. అలాగే ఇ-ఫైలింగ్ పోర్టల్ రిజిస్టర్ కాని సుమారు 4.84లక్షల పన్నుచెల్లింపుదారులకు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఎస్‌ఎంఎస్ లు పంపినట్టు తెలిపింది.
అయితే ఎస్ ఎంఎస్ ఇ-మెయిల్ చట్టపరమైన నేపధ్య లేని నేపథ్యంలో, అధికారిక నోటీసులు పంపడానికి, తదుపరి చర్యలు మార్చి 31 వరకు వేచి ఉంటామని తెలిపింది. ఆపై సందేహాస్పద డిపాజిట్లపై చర్యలుంటాయని తెలిపింది. ఆదాయ వెల్లడికి ఉద్దేశించిన పథకం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మార్చి 31 వరకు నడుస్తుంది కాబట్టి , ఈ లోపు సంపదను వెల్లడించి పన్నులు చెల్లించాస్తారా లేదా అనేది డిపాజిటర్లు తేల్చుకోవాలని పేర్కొంది.
కాగా రద్దయిన నోట్ల డిపాజిట్లపై 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను గుర్తించిన ఆదాయపన్ను శాఖ వివరణ ఇవ్వాల్సిందిగా ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్ ల ద్వారా కోరింది. ఇందుకుగానుఫిబ్రవరి 15వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.