తొమ్మిది విడతల్లో సార్వత్రిక ఎన్నికల సమరం | Nine-phased LS polls to start from April 7, counting on May 16 | Sakshi
Sakshi News home page

తొమ్మిది విడతల్లో సార్వత్రిక ఎన్నికల సమరం

Published Thu, Mar 6 2014 1:04 AM | Last Updated on Sun, Mar 10 2019 8:01 PM

Nine-phased LS polls to start from April 7, counting on May 16

 షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
 మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 9 విడతల్లో పోలింగ్
 ఏప్రిల్-7 మొదలుకుని మే-12 వరకూ పోలింగ్ నిర్వహణ
 మే-16న ఓట్ల లెక్కింపు.. అదే రోజున ఫలితాల వెల్లడి
 లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, 
 ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు 
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నికలు.. 2 విడతలుగా పోలింగ్
 7వ విడతలో తెలంగాణలో.. 8వ విడతలో సీమాంధ్రలో
 షెడ్యూలు ప్రకటనతో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
 
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 543 లోక్‌సభ స్థానాలతో పాటు..  ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం ఈసారి రికార్డు స్థాయిలో 9 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 7న, చివరి విడత మే 12న జరుగుతుంది. మే 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.

మే 28వ తేదీకి ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. లోక్‌సభ ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలు కూడా రెండు విడతల్లో జరగనున్నాయి. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, చట్టాల్లోని నిబంధనల మేరకు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ స్పష్టంచేశారు.

‘‘ఎన్నికైన లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక.. రాజ్యాంగంలోని నిబంధనలు, అపాయింటెడ్ డే మేరకు ఆయా రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఆయా రాష్ట్రాల్లోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు’’ అని ఆయన వివరించారు. సీఈసీ సంపత్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల అధికారులు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీలతో కలిసి 2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

లోక్‌సభ, మూడు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతో పాటు.. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు వివరించారు. షెడ్యూల్ విడుదలతో బుధవారం నుంచే దేశంలో రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని.. దీనిని మే 28వ తేదీన ఉపసంహరిస్తామని స్పష్టంచేశారు.
 
పారదర్శకతతో పోలింగ్
రాబోయే ఎన్నికలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో మైలు రాయి అని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ అభివర్ణించారు. ఈ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా, శాంతియుతంగా, పారదర్శకంగా, భాగస్వామ్యయుతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు మీడియా సంస్థలు, పాత్రికేయులు చైతన్యవంతమైన సహకారం అందించాలని కోరారు. చెల్లింపు వార్తల నియంత్రణకు ఇప్పటికీ చట్టం లేదని, ఈ దృష్ట్యా వాటిని ఎన్నికల నేరంగా మార్చాలని న్యాయశాఖకు ప్రతిపాదించిట్లు వెల్లడించారు.

అలాగే పత్రికల్లో చెల్లింపు వార్తలపై వచ్చే ఫిర్యాదులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేవాటిపై కేసులను నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)కు పంపిస్తామని వివరించారు. అయితే ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించాలన్న డిమాండ్లపై ఒక ప్రశ్నకు సీఈసీ స్పందిస్తూ, దీనిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచార క్రమంలో రాజకీయ చర్చల్లో ఉన్నత ప్రమాణాలను పాటించటం, నిజాయితీగా వ్యవహరించటం ద్వారా దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టాలని ఆయన రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తి సమాచారం తెలుసుకుని, నైతిక పద్ధతిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు.  సీఈసీ ఇంకా ఏమన్నారంటే...
 
* 2014 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం బుధవారం నుంచి 72 రోజులు సాగనుంది. ఇది 2009 సార్వత్రిక ఎన్నికలకు పట్టిన సమయం కన్నా మూడు రోజులు తక్కువ. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో 81.4 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో సుమారు 10 కోట్ల మందికిపైగా కొత్త ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో తొలిసారిగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నాం. 
 
మార్చి 9వ తేదీన దేశ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవచ్చు. రాబోయే ఎన్నికల ముందు ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకూ 98.6 శాతం మందికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు అందచేశాం. 
 
దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 2009తో పోలిస్తే లక్ష పోలింగ్ కేంద్రాలు అదనం. 
పోలింగ్‌లో ఓటర్లను భాగస్వామ్యం చేయడానికి వీలుగా పోలింగ్‌కు వారం రోజుల ముందు నుంచే ఫొటో ఓటరు స్లిప్పులను ఓటర్లకు ఇంటి వద్ద అందచేస్తాం. 
 
పోలింగ్ మొత్తం ఈవీఎంలతోనే జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా (‘పైవారెవరూ కాదు’ అంటూ తిరస్కరించే) బటన్‌ను ఈవీఎంలో పొందుపర్చాం. 
 
ఓటరు వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీపీఏటీ) వ్యవస్థను అమలు చేయనున్నాం. ఓటరు పార్టీ ఎన్నికల గుర్తున్న బటన్ నొక్కగానే సదరు ఓటు వేసిన పార్టీ గుర్తుతో ఉన్న స్లిప్ ఈవీఎం నుంచి బయటకు వస్తుంది. దీనికోసం ప్రస్తుతం ఎన్నికల సంఘం వద్ద 600 యూనిట్ల పేపరు అందుబాటులో ఉండగా, మరో 20 వేల యూనిట్లకు ఆర్డరు చేశాం. 
 
* పెయిడ్ వార్తల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం. పత్రికల్లో, టీవీల్లో పెయిడ్ కథనాల ప్రచురణ, ప్రసారమైనట్టు నిర్ధారణ అయితే తగు చర్యలు తీసుకునేలా ప్రెస్‌కౌన్సిల్, జాతీయ బ్రాడ్‌కాస్ట్ అథారిటీలను ఆదేశిస్తాం.
 
ఎన్నికల్లో ధన బలం వినియోగం ఆందోళన కలిగించే అంశం. ఈ ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడతాం. ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో అభ్యర్థులు ధనాన్ని వినియోగించటాన్ని నిలువరించేందుకు సంచార తనిఖీ బృందాలు, వీడియో నిఘా బృందాలను నియమిస్తాం. 
 
అభ్యర్థుల వ్యయాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఎన్నికల వ్యయాన్ని క్షుణ్నంగా పరి శీలించి, ప్రజలు చూసేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో పెడతాం. 
 సున్నిత, అత్యంత సున్నిత నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాం.
 
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్... 
 మార్చి-5 (బుధవారం) ఎన్నికల షెడ్యూల్ విడుదల

మొదటి విడత: 6 లోక్‌సభ స్థానాలు 
(అస్సాం 5, త్రిపుర 1)
 నోటిఫికేషన్ జారీ: మార్చి 14 (శుక్రవారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 21 (శుక్రవారం)
 నామినేషన్ల పరిశీలన: మార్చి 22 (శనివారం)
 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 24 (సోమవారం)
 పోలింగ్ తేది: ఏప్రిల్ 7 (సోమవారం)
 ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
2వ విడత: 7  స్థానాలు 
(అరుణాచల్‌ప్రదేశ్ 2, మేఘాలయ 2, మణిపూర్ 1, మిజోరం 1, నాగాలాండ్ 1)
 నోటిఫికేషన్ జారీ: మార్చి 15 (శనివారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 22 (శనివారం)
 నామినేషన్ల పరిశీలన: మార్చి 24 (సోమవారం)
 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 26 (బుధవారం)
 పోలింగ్ తేది: ఏప్రిల్ 9 (బుధవారం)
 ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
3వ విడత: 92  స్థానాలు 
 (బీహార్ 6, ఛత్తీస్‌గఢ్ 1, హర్యానా 10, జమ్మూకాశ్మీర్ 1, జార్ఖండ్ 5, కేరళ 20, మధ్యప్రదేశ్ 9, మహారాష్ట్ర 10, ఒడిషా 10, ఉత్తరప్రదేశ్ 10, అండమాన్ నికోబార్ దీవులు 1, చండీగఢ్ 1, లక్ష్యద్వీప్ 1, ఢిల్లీ 7)
 నోటిఫికేషన్ జారీ: మార్చి 15 (శనివారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 22 (శనివారం)
 నామినేషన్ల పరిశీలన: మార్చి 24 (సోమవారం)
 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 26 (బుధవారం)
 పోలింగ్ తేది: ఏప్రిల్ 10 (గురువారం)
 ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
4వ విడత: 5 స్థానాలు 
(అస్సాం 3, సిక్కిం 1, త్రిపుర 1)
 నోటిఫికేషన్ జారీ: మార్చి 19 (బుధవారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 26 (బుధవారం)
 నామినేషన్ల పరిశీలన: మార్చి 27 (గురువారం)
 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 29 (సోమవారం)
 పోలింగ్ తేది: ఏప్రిల్ 12 (శనివారం)
 ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
5వ విడత: 122  స్థానాలు 
(బీహార్ 7, ఛత్తీస్‌గఢ్ 3, గోవా 2, జమ్మూకాశ్మీర్ 1, జార్ఖండ్ 5, కర్ణాటక 28, మధ్యప్రదేశ్ 10, మహారాష్ట్ర 19, మణిపూర్1,ఒడిషా 11, రాజస్థాన్ 20, ఉత్తరప్రదేశ్ 11, పశ్చిమబెంగాల్ 4)
 నోటిఫికేషన్ జారీ: మార్చి 19 (బుధవారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 26 (బుధవారం)
 నామినేషన్ల పరిశీలన: మార్చి 27 (గురువారం)
 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 29 (శనివారం)
 పోలింగ్ తేది: ఏప్రిల్ 17 (గురువారం)
 ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
6వ విడత - 117  స్థానాలు 
 (అస్సాం 6, బీహార్ 7, ఛత్తీస్‌గఢ్ 7, జమ్మూకాశ్మీర్ 1, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 10, మహారాష్ట్ర 19, రాజస్థాన్ 5, తమిళనాడు39, ఉత్తరప్రదేశ్ 12, పశ్చిమబెంగాల్ 6, పాండిచ్చేరి 1) 
 నోటిఫికేషన్ జారీ: మార్చి 29 (శనివారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: ఏప్రిల్ 5 (శనివారం)
 నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7 (సోమవారం)
 నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 9 (బుధవారం)
 పోలింగ్ తేది: ఏప్రిల్ 24 (గురువారం)
 ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
7వ విడత: 89  స్థానాలు 
(ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ)) 17, బీహార్ 7, గుజరాత్ 26, జమ్మూకాశ్మీర్ 1, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమబెంగాల్ 9, దాదర్ నాగర్ హవేలీ 1, డామన్ డయ్యు 1) 
 నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 2 (బుధవారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: ఏప్రిల్ 9 (బుధవారం)
 నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 10 (గురువారం)
 నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 12 (శనివారం)
 పోలింగ్ తేది: ఏప్రిల్ 30 (బుధవారం)
 ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
8వ విడత: 64 స్థానాలు 
(ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) 25, బీహార్ 7, హిమాచల్‌ప్రదేశ్ 4, జమ్ముకాశ్మీర్ 2, ఉత్తర్‌ప్రదేశ్ 15, ఉత్తరాఖండ్ 5, 
 పశ్చిమబెంగాల్6)
 నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 12 (శనివారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: ఏప్రిల్ 19 (శనివారం)
 నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 21  (సోమవారం)
 నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 23 (బుధవారం)
 పోలింగ్ తేది: మే 7 (బుధవారం)
 ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
9వ విడత: 41 స్థానాలు 
(బీహార్ 6, ఉత్తర్‌ప్రదేశ్ 18, పశ్చిమబెంగాల్ 17)
 నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 17 (గురువారం)
 నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: ఏప్రిల్ 24 (గురువారం)
 నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 25  (శుక్రవారం)
 నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 28 (సోమవారం)
పోలింగ్ తేది: మే 12 (సోమవారం)
ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం)
 
ఒడిశా అసెంబ్లీకీ రెండు విడతలు...
* ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడతలో 70 నియోజకవర్గాలకు ఏప్రిల్ 10న, రెండో విడతలో 77 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 17వ తేదిన పోలింగ్ జరగనుంది. 
 
సిక్కింలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 12వ తేదిన పోలింగ్ నిర్వహించనున్నారు. 
 
బీహార్-2, గుజరాత్-7, మధ్యప్రదేశ్ -1, మహారాష్ట్ర-1, మిజోరం-1, ఉత్తరప్రదేశ్-4, తమిళనాడు-1, పశ్చిమబెంగాల్-6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement