నిర్భయ కేసును పోలీసులు ఛేదించిందెలా? | Nirbhaya case: How police core team cracked it | Sakshi
Sakshi News home page

నిర్భయ కేసును పోలీసులు ఛేదించిందెలా?

Published Tue, Sep 10 2013 4:10 PM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

నిర్భయ కేసును పోలీసులు ఛేదించిందెలా?

నిర్భయ కేసును పోలీసులు ఛేదించిందెలా?

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో 'నిర్భయ'పై జరిగిన సామూహిక అత్యచారం కేసును విచారించేందుకు 100 మంది పోలీసులతో బృందం ఏర్పాటైంది. కానీ, ప్రధానంగా 8 మందితో కూడిన కోర్ బృందమే నిద్రాహారాలు లేకుండా రోజుకు 24 గంటలూ కష్టపడి మరీ ఈ కేసులోని ప్రతి చిన్న అంశాన్నీ భూతద్దాలతో గాలించింది. బాల నేరస్థుడు సహా అందరి దాష్టీకాన్ని బయటపెట్టింది. పోలీసులపై ఎంత విమర్శలొస్తున్నా పట్టించుకోకుండా ఐదే రోజుల్లో అందరినీ పట్టుకుని, కీలక సాక్ష్యాలు సేకరించింది. రెండు వారాల్లో వెయ్యిపేజీల చార్జిషీటును దాఖలు చేయడం వల్లే నిందితులు దోషులుగా తేలారు.

అదనపు డిప్యూటీ కమిషనర్ పి.ఎస్. కుష్వాహా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పడింది. నిందితులందరినీ అరెస్టు చేయడంతోనే తమ పని అయిపోలేదని కుష్వాహా అన్నారు. కేసును నిరూపించడమే తమకు అతిపెద్ద సవాలని ఆయన చెప్పారు. నిందితులపై పక్కా సాక్ష్యాలు సేకరించాలి. నిందితుల విచారణ, వాళ్ల ప్రకటనలను రికార్డుచ ఏయడం కూడా చాలా ముఖ్యం. దాంతో సిట్ రెండు బృందాలుగా విడిపోయింది. ఒక బృందానికి చార్జిషీటు తయారీ బాధ్యత అప్పగించగా, మరో బృందం సాక్ష్యాల సేకరణలో మునిగిపోయింది.  తమ సాక్ష్యాలన్నింటికీ డీఎన్ఏ పరీక్షలు బలం చేకూర్చాయని కుష్వాహా చెప్పారు. నిందితుల దంతాల దగ్గర్నుంచి దుస్తుల వరకు అన్నీ ఉపయోగపడ్డాయి. నిందితులు బాధితురాలు, ఆమె స్నేహితుడి దుస్తులు కాల్చేశారు. పాక్షికంగా కాలిన దుస్తులు పోలీసులకు దొరికాయి. అవి బాధితులవేనని డీఎన్ఏ పరీక్షలో తేలింది.  నిందితులు బస్సును కడిగేసినా, కొన్ని రక్తపు మరకలు దొరికాయి.
చార్జిషీటు ఎంత పక్కాగా తయారైందంటే, ఒకవేళ మొత్తం 88 మంది సాక్షులూ ఎదురు తిరిగినా, కేసు మాత్రం నిరూపితం అయ్యేంత బలమైన సాక్ష్యాలు దొరికాయి.

బృందంలో మరో కీలక అధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ చందర్. ప్రధానంగా ఈ బృందంలోని పోలీసులకు ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడటం, ఆగ్రహంగా ఉన్న ప్రజలను శాంతింపజేయడం ఈయన ప్రధాన విధులు. దాంతోపాటు బృంద సభ్యుల మధ్య సమన్వయం కూడా ఈయన బాధ్యతే. వసంత విహార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ సింగ్ దర్యాప్తు మొత్తానికి కీలకం.  డిసెంబర్ 21న చిట్టచివరి అరెస్టు జరిగాక, సాక్ష్యాల సేకరణలో ఈయనే కీలకంగా వ్యవహరించారు. బాధితుల శరీరం మీద కొరికిన మచ్చల నుంచి డీఎన్ఏ సేకరించారు. అలాగే బస్సులో కొద్దిగా మిగిలిన రక్తపు మరకలు తీసుకున్నారు. సీఎఫ్ఎస్ఎల్ నుంచి వీటి నివేదికలు తెప్పించారు. మొత్తం విషయం తెలిసేవరకు సిట్ బృందంలో ఏ ఒక్కరూ నిద్రపోలేదు. ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోడానికి స్టేషన్ ముందు తలుపులు వేసేసి, వెనక తలుపుల గుండా వెళ్లి వచ్చేవారు.

ఇన్స్పెక్టర్ అనిల్ శర్మ నిందితులతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించారు. నిందితులను గుర్తించి, వారిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం ఈయన బాధ్యత. రోజూ జరిగే వ్యవహారాలను సీనియర్లకు చెప్పాల్సింది కూడా ఈయనే. ఇన్స్పెక్టర్ అతుల్ కుమార్ ప్రధానంగా దర్యాప్తులో సాయం చేశారు. చార్జి షీటులో వెయ్యి పేజీలు ఈయనే రాశారు. నాటి డీసీపీ, ప్రస్తుతం మిజొరాం డీఐజీ ఛాయాశర్మ కూడా ఈ కేసు దర్యాప్తులో కీలక అధికారిణి. కేసు విచారణ మొదలుపెట్టేటప్పుడు అంతా గుడ్డిగానే వెళ్లామని, కానీ త్వరగానే నిందితులను పట్టుకోగలిగామని చెప్పారు. వాళ్లను పట్టుకోడానికి ఛాయాశర్మ రాజస్థాన్, బీహార్.. ఇలా అనేక ప్రాంతాలు తిరిగారు. మీడియాకు కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చెప్పింది ఈమే. వీళ్లతో పాటు.. వందమంది అధికారులు కూడా ఈ కేసులో చురుగ్గా వ్యవహరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement