ఆ కీచకులందరూ దోషులే | All accused guilty: 4 takeaways from Delhi gangrape verdict | Sakshi
Sakshi News home page

ఆ కీచకులందరూ దోషులే

Published Wed, Sep 11 2013 12:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

All accused guilty: 4 takeaways from Delhi gangrape verdict

* నిర్భయ కేసులో ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు  
* సంప్రదాయ, శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా నిర్ధారణ
* ముఖేష్, వినయ్, పవన్, అక్షయ్‌లను దోషులుగా తేల్చిన కోర్టు
* మరణించిన రాంసింగ్ కూడా దోషే అని నిర్ధారణ
* 237 పేజీల తీర్పును వెలువరించిన న్యాయమూర్తి
* బుధవారం శిక్షలు ఖారారు చేసే అవకాశం
 
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిసెంబర్ 16 ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులు దోషులే అని ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. నిస్సహాయురాలైన బాధితురాలిపై అత్యాచారం, హత్య అభియోగాల్లో ముఖేష్‌కుమార్(26), వినయ్‌శర్మ(20), అక్షయ్ ఠాకూర్(28), పవన్‌గుప్తా(19)లను దోషులుగా ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. సంప్రదాయ ఆధారల ప్రకారమే కాక, శాస్త్రీయమైన డీఎన్‌ఏ నమూనాల ఆధారంగా వీరిని దోషులుగా నిర్ధారించింది. విచారణ సమయంలో మరణించిన నిందితుడు రాంసింగ్‌ను కూడా కోర్టు దోషిగా తేల్చింది.

అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, ఆధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు తదితర 13 అభియోగాల్లో నిందితులను దోషులుగా నిర్దారించింది. ఈ మేరకు సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి యోగేష్ ఖన్నా మంగళవారం 237 పేజీల తీర్పును వెలువరించారు. నిందితులందరూ కలిసి నిస్సహాయురాలైన బాధితురాలిని హత్య చేసినట్టు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని, ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), 376(2)(జీ)(సామూహిక అత్యాచారం) ప్రకారం నిందితులను దోషులుగా నిర్ధారిస్తున్నామని తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి ప్రకటించారు. వీటితో పాటు సామూహిక అత్యాచారం, అసహజ నేరాలు, సాక్ష్యాలను మాయం చేయడం, హత్యాయత్నం తదితర నేరాలకు నిందితులు పాల్పడినట్టు నిర్ధారించారు.

వైద్య సహాయం అందడంలో ఆలస్యం, చికిత్స సమయంలో ఇన్‌ఫెక్షన్ సోకడం వల్లే బాధితురాలు చనిపోయిందన్న డిఫెన్స్ లాయర్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. నిర్భయ కేసులో తీర్పు సందర్భంగా కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. బుధవారం నిందితులకు శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నలుగురికి విధించే శిక్షపై న్యాయస్థానంలో బుధవారం ఉదయం 11 గంటలకు వాదప్రతివాదనలు జరుగనున్నాయి.

ప్రణాళిక ప్రకారమే అత్యాచారం
మునిర్కా బస్టాండ్ వద్ద బాధితురాలు, ఆమె స్నేహితుడు బస్సులోకి ఎక్కిన తర్వాత వేరెవరినీ నిందితులు బస్సులోకి ఎక్కనివ్వలేదని, పరుషమైన బాష ఉపయోగిస్తూ, లైట్లు ఆపేసి యువతిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారని న్యాయమూర్తి చెప్పారు. ప్రణాళిక ప్రకారమే నిందితులు బాధితురాలిపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. నిందితులు ఇనుప రాడ్లను వాడిన తీరు, శరీరాన్ని గాయపరిచిన తీరు యువతిని అదుపులోకి తీసుకోవడానికి చేసినది మాత్రమే కాదని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

సామూహిక అత్యాచారం కోసమే ఇనుపరాడ్లను బాధితురాలి శరీరంలోనికి చొప్పించారని భావించడానికి లేదని, ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే లోపలి భాగాలను బయటకు లాగారని అభిప్రాయపడ్డారు. బాధితురాలి శరీరంపై తీవ్రంగా గాయపరచడమే కాక ఇనుప రాడ్‌ను పదేపదే శరీరంలోనికి జొప్పించి బయటకు తీశారని, చేతితో కూడా కీలకమైన అవయవ భాగాలను బయటకు లాగారని, ఆమెను చంపే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఇనుప రాడ్లను వాడటంవల్ల బాధితురాలి శరీరం లోపలి అవయవాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆ తర్వాతే ఆమెను, ఆమె మిత్రుడిని బస్సు నుంచి బయటకు తోసేశారని, నగ్నంగా, రక్తమోడుతూ వారు రోడ్డుపై పడ్డారని, చీకటి కారణంగా వారిని ఎవరూ గుర్తించలేకపోయారని వివరించారు. బాధితురాలి శరీరం లోపల 18 గాయాలనున్నాయని, ఇవన్నీ ఆమెను చంపడానికి చేసినవే అని న్యాయమూర్తి చెప్పారు.

దర్యాప్తు సంస్థలు సమర్పించిన డీఎన్‌ఏ విశ్లేషణలు కూడా బాధితురాలితో పాటు నిందితుల గుర్తింపును నిర్ధారించాయని స్పష్టం చేశారు. వారంతా ఆ సమయంలో బస్సులోనే ఉన్నారని వేలిముద్రల నివేదిక కూడా స్పష్టం చేసిందని చెప్పారు. తాను బస్సును మాత్రమే నడిపానని, అత్యాచారంలో పాల్గొనలేదన్న ముఖేష్ విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది. సామూహిక అత్యాచారం, హత్య కేసుల సందర్భంలో పాత్ర ఉన్నవారందరినీ సమానంగానే చూడటం జరుగుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలి వాంగ్మూలం, ఫోరెన్సిక్ ఆధారాలు, వేలిముద్రల నివేదిక, డెంటల్ మోడల్స్, డీఎన్‌ఏ శాంపిల్స్, నిందితుల వైద్య నివేదికలు, ఎలక్ట్రానిక్ ఆధారలు, ఆరెస్ట్ అయిన తర్వాత నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లను పరిశీలించినట్టు న్యాయమూర్తి చెప్పారు. నిందితులు చేసిన గాయాల కారణంగానే బాధితురాలు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. కేసు విచారణ వేగంగా సాగేందుకు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు న్యాయమూర్తి అభినందనలు తెలిపారు. ఈ కేసు విచారణ కోసం ఢిల్లీ పోలీసులు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడాన్ని స్వాగతించిన న్యాయస్థానం.. మిగతా అత్యాచారం కేసుల్లోను ఇదే పద్ధతి అనుసరించాలని సూచించింది.

 కన్నీటి పర్యంతమైన పవన్
 న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే నిందితులందరూ దిగ్భ్రాం తికి గురయ్యారు. పవన్ కోర్టు హాలులోనే కన్నీటిపర్యంతమవగా, వినయ్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. ఇక ముఖేష్ స్పందిస్తూ చేసిన దానికి పర్యవసానాలు అనుభవించాల్సిందే అని వ్యాఖ్యానించి నట్టు తెలిసింది. మరో నిందితుడు అక్షయ్ ఎటువంటి భావం లేకుండా ఉండిపోయాడు.
 
వారిని సజీవ దహనం చేయాలి: మరణవాంగ్మూలంలో నిర్భయ
తనపై క్రూరమైన దాడి జరిగిన ఐదురోజులకు ఓ మేజిస్ట్రేట్ ఎదుట హిందీలో నిర్భయ వాంగ్మూలం ఇచ్చింది. కదులుతున్న బస్సులో గంటసేపు తనను కిరాతకంగా ఎలా హింసించారో ఆమె వివరించింది. రెండుసార్లు తాను స్పృహ కోల్పోయినప్పటికీ తనను తిరిగి స్పృహలోకి తెచ్చి చెప్పలేని రీతిలో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. నిందితులకు ఎటువంటి శిక్ష విధించాలి అని మేజిస్ట్రేట్ ప్రశ్నించగా, ‘‘మరో మహిళపై ఇటువంటి అఘాయిత్యం చోటుచేసుకోకుండా ఉండాలంటే వారిని ఉరి తీయాలి. వారిని సజీవంగా దహనం చేయాలి’’ అని చెప్పింది.
 
ఉరితీయాల్సిందే: రాజకీయ నాయకులు
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కేసులో దోషులుగా తేలిన నలుగురు కీచకులకూ మరణశిక్ష విధించాలని పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. ఇంకెవరూ ఇలాంటి దురాగతాలకు దిగే ఆలోచనైనా చేయకుండా ఉండేలా నలుగురు దోషులనూ ఉరితీయాలని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. ఇదే కేసులో ఇటీవల దోషిగా తేలిన బాల నేరస్తుడికి జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల శిక్ష మాత్రమే విధించడంపై సుష్మా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా దోషులకు విధించే శిక్ష ఉండాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ అన్నారు. రేప్ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని సీపీఎం నాయకురాలు బృందా కారత్ సూచించారు. దోషులకు మరణశిక్ష విధిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుందని మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement