నిర్భయ కేసులో మైనర్పై తీర్పు వాయిదా
దేశ రాజధానిలో గత సంవత్సరం డిసెంబర్ 16న జరిగిన సామూహిక అత్యాచారం కేసు (నిర్భయ కేసు)లో మైనర్ నిందితుడిపై తీర్పును జువెనైల్ జస్టిస్ బోర్డు ఈనెలాఖరుకు వాయిదా వేసింది.'బాల నేరస్థుడు' అనే పదాన్ని ఎలా అన్వయించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు కావడం, అక్కడ తీర్పు త్వరలో వెలువడనుండటంతో ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ నేతృత్వంలోని బోర్డు తన తీర్పును ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసింది.
జూలై 11వ తేదీ నుంచి ఇప్పటికి వరుసగా నాలుగోసారి ఈ కేసులో తీర్పు వాయిదా పడింది. 'బాల నేరస్థులు' అనే పదానికి అన్వయం ఎలా తీసుకోవాలంటూ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 14న తన తీర్పును వాయిదా వేసింది. బాల నేరస్థుల చట్టం ఏమాత్రం సరిగా లేదని, ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు తీర్మానాలను అది ఉల్లంఘిస్తోందని స్వామి వాదించారు.
బాల నేరస్థుల నేరాన్ని నిర్ధారించేటప్పుడు కేవలం వారి వయస్సు 18 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన మాత్రమే కాక, వారి మానసిక స్థితి, తెలివితేటలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నిర్భయ కేసులో బాల నేరస్థుడు కూడా మిగిలినవారితో పాటు అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. కీలక నిందితుడు రామ్ సింగ్ మార్చి 11న తీహార్ జైల్లో మరణించడంతో అతడిపై విచారణ నిలిపివేశారు.
బాల నేరస్థుడిపై మాత్రం జూలై 11, జూలై 25, ఆగస్టు 5, ఆగస్టు 19 తేదీల్లో.. అంటే నాలుగుసార్లు తీర్పు వాయిదా పడింది. నిందితులందరిలోకీ బాల నేరస్థుడే అందరికంటే క్రూరంగా ప్రవర్తించినట్లు పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. అయితే.. జువైనల్ బోర్డు వద్ద విచిరణలో మాత్రం తాను నిర్దోషినని బాలనేరస్థుడు పేర్కొన్నాడు. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఇతడు 11 ఏళ్ల వయసులో ఢిల్లీ వెళ్లాడు. ఇంతకుముందు ఓ కార్పెంటర్ను దోచుకున్న కేసులో ఇతడిపై నేరం రుజువైంది.