న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. దోషులకు అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. నిర్భయ మరణ వాంగ్ములాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధ్రువీకరించింది. సీసీ టీవీ పుటేజ్‌ను సరైన సాక్ష్యంగా సుప్రీంకోర్టు పరిగణించింది. హైకోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది.
అమానుషంగా వ్యవహరించిన దోషులకు ఉరే సరైనదని, భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి నేరం చేయకూడదని వ్యాఖ్యానించింది. తమ సంతోషాన్ని తీర్చుకునేందుకు దోషులు శాడిస్ట్‌లుగా వ్యవహరించారని, భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి నేరం చేయకూడదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసులు తిరుగులేని సాక్ష్యాలిచ్చారని, నేర తీవ్రత సమాజం మొత్తాన్ని కదిలించిందని పేర్కొంది.
సాక్షాత్తు దేశ రాజధానిలోనే కదులుతున్న బస్సులో అత్యంత ఘోరంగా.. పాశవికంగా సామూహిక అత్యాచారం చేసిన కేసులో నిందితులకు ఐదేళ్ల తర్వాత శిక్ష ఖరారు అయింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్ష సరైనదిగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వాస్తవానికి ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు వెలువడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది.
2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం చెలరేగింది.
దాంతో ఇప్పుడు బాలనేరస్తుల చట్టాన్ని కూడా సవరించారు. 16-18 ఏళ్ల మధ్య వయసున్నవారు తీవ్రమైన నేరాలు చేస్తే వారిని పెద్దవాళ్లు గానే భావించాలని చెప్పారు. ఫిజియోథెరపీ చదువుతున్న నిర్భయ తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో బస్సు ఎక్కగా, అతడిని చితక్కొట్టి ఆమెపై ఆరుగురు కలిసి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు చేసుకున్న అప్పీలుపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్. భానుమతి, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తన తుది తీర్పును ఇవాళ వెల్లడించింది.
అయితే పిటిషన్‌ను విచారించిన ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు ఒక రకంగా మూడోవారైన మహిళా జడ్జి మాత్రం ఇంకోరకంగా తీర్పు చెప్పడం గమనార్హం. ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ దీపక్ మిశ్రా సహా జస్టిస్ అశోక్ భూషణలు నిర్భయ దోషులకు ఉరిశిక్షే సరైనదని తీర్పు చెప్పగా జస్టిస్ భానుమతి మాత్రం ఈ సమస్యను విశాల దృక్ఫథంతో ఆలోచించాలని అన్నారు. ఆడపిల్లలను, మహిళలను గౌరవించే సంస్కారాన్ని నేర్పే విద్యావ్యవస్థ అవసరమని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2-1 తేడాతో దోశులకు ఉరిశిక్షను ఖరారుచేసింది. తీర్పు చదువుతుండగా కోర్టు హాల్ చప్పట్లతో మారుమోగింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.