నిర్భయ కేసును ఛేదించిందిలా
నిర్భయ కేసులో దోషులు నలుగురికీ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే.. ఈ కేసులో సాక్ష్యాలు సేకరించడానికి, నిందితులను ఐదు రోజుల్లోనే అరెస్టు చేయడానికి, వారిపై నేరాన్ని రుజువు చేసే తిరుగులేని ఆధారాలు సంపాదించడానికి పోలీసులు అహరహం శ్రమించారు. దాదాపు వంద మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినా.. ప్రధానంగా ఎనిమిది మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన కృషి అనిర్వచనీయం. వారి కష్టం ఫలితంగానే ఇప్పుడు అందరికీ ఉరిశిక్ష పడింది. ఈ బృందం నిద్రాహారాలు లేకుండా రోజుకు 24 గంటలూ కష్టపడి మరీ ఈ కేసులోని ప్రతి చిన్న అంశాన్నీ భూతద్దాలతో గాలించింది. బాల నేరస్థుడు సహా అందరి దాష్టీకాన్ని బయటపెట్టింది. పోలీసులపై ఎంత విమర్శలొస్తున్నా పట్టించుకోకుండా ఐదే రోజుల్లో అందరినీ పట్టుకుని, కీలక సాక్ష్యాలు సేకరించింది. రెండు వారాల్లో వెయ్యిపేజీల చార్జిషీటును దాఖలు చేయడం వల్లే దోషులకు ఉరిశిక్ష పడింది.
అదనపు డిప్యూటీ కమిషనర్ పి.ఎస్. కుష్వాహా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పడింది. నిందితులందరినీ అరెస్టు చేయడంతోనే తమ పని అయిపోలేదని కుష్వాహా అన్నారు. సిట్ రెండు బృందాలుగా విడిపోయింది. ఒక బృందానికి చార్జిషీటు తయారీ బాధ్యత అప్పగించగా, మరో బృందం సాక్ష్యాల సేకరణలో మునిగిపోయింది. తమ సాక్ష్యాలన్నింటికీ డీఎన్ఏ పరీక్షలు బలం చేకూర్చాయని కుష్వాహా చెప్పారు. నిందితుల దంతాల దగ్గర్నుంచి దుస్తుల వరకు అన్నీ ఉపయోగపడ్డాయి. బృందంలో మరో కీలక అధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ చందర్. ప్రధానంగా ఈ బృందంలోని పోలీసులకు ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడటం, ఆగ్రహంగా ఉన్న ప్రజలను శాంతింపజేయడం ఈయన ప్రధాన విధులు. వసంత విహార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ సింగ్ దర్యాప్తు మొత్తానికి కీలకం. బాధితుల శరీరం మీద కొరికిన మచ్చల నుంచి డీఎన్ఏ సేకరించారు. అలాగే బస్సులో కొద్దిగా మిగిలిన రక్తపు మరకలు తీసుకున్నారు.
ఇన్స్పెక్టర్ అనిల్ శర్మ నిందితులతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించారు. నిందితులను గుర్తించి, వారిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం ఈయన బాధ్యత. రోజూ జరిగే వ్యవహారాలను సీనియర్లకు చెప్పాల్సింది కూడా ఈయనే. ఇన్స్పెక్టర్ అతుల్ కుమార్ ప్రధానంగా దర్యాప్తులో సాయం చేశారు. చార్జి షీటులో వెయ్యి పేజీలు ఈయనే రాశారు. నాటి డీసీపీ, ప్రస్తుతం మిజొరాం డీఐజీ ఛాయాశర్మ కూడా ఈ కేసు దర్యాప్తులో కీలక అధికారిణి. నిందితులను పట్టుకోడానికి ఆమె రాజస్థాన్, బీహార్.. ఇలా అనేక ప్రాంతాలు తిరిగారు. మీడియాకు కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చెప్పింది ఈమే.