
అమెరికా సహాయ ప్యాకేజీలు యథాతథం
న్యూయార్క్: మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే అమెరికాలో సహాయ ప్యాకేజీలను యథాతథంగా కొనసాగించాలని అక్కడి సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. రెండు రోజుల పాటు జరిగిన పాలసీ సమీక్ష అనంతరం యూఎస్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) ప్యాకేజీల్లో ప్రస్తుతానికి ఎలాంటి కోత ఉండదని ప్రకటించింది. దీంతో నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలుకు(స్టిమ్యులస్) ఆటంకం తొలగినట్టే. ప్రధానంగా అమెరికాలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రికవరీ ఆశించినదానికంటే తక్కువ మోతాదులో ఉండటం, భవిష్యత్తులో కూడా పుంజుకునే అవకాశాలు సన్నగిల్లడమే దీనికి కారణం. ఇటీవలే 16 రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాల మూసివేత(షట్‌డౌన్) కూడా వృద్ధి రికవరీకి ప్రతికూలాంశంగా నిలవడంతో ఫెడ్ ప్రస్తుతానికి స్టిమ్యులస్‌కు కోతపెట్టకుండా వదిలేసింది. ప్రైవేటు రంగంలో ఉద్యోగ నియామకాలు కూడా మళ్లీ తగ్గుతుండటం, ద్రవ్యోల్బణం కనిష్టస్థాయిలోనే ఉండటం(ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 1.2 శాతమే-ఫెడ్ లక్ష్యం 2%) కూడా స్టిమ్యులస్ ఉపసంహరణపై వెనక్కితగ్గడానికి ప్రధాన కారకాలు. నిరుద్యోగ రేటు అధిక స్థాయిలోనే కొనసాగుతుండటం(ప్రస్తుతం 6.5 శాతంపైన ఉంది) అత్యంత ఆందోళనకరమైన అంశమని ఫెడ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ, కాబోయే చీఫ్, ప్రస్తుత వైస్ చైర్‌పర్సన్ జానెట్ ఎలెన్ అభిప్రాయపడినట్లు సెంట్రల్ బ్యాంక్ వర్గాల సమాచారం.
మరోపక్క, పాలసీ వడ్డీరేట్లను ప్రస్తుత స్థాయిలోనే(పావు శాతంగా ఉంది) కొనసాగించడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని కూడా ఫెడ్ తేల్చి చెప్పింది. ‘తాజా గణాంకాల ప్రకారం ప్రజల వినియోగ వ్యయం, వ్యాపార పెట్టుబడులు కాస్త పుంజుకున్నాయి. అయితే, హౌసింగ్ రంగంలో గత కొద్ది నెలలుగా రికవరీ తగ్గుముఖం పట్టింది’ అని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌ఓఎంసీ) పేర్కొంది. ఫెడ్ తాజా నిర్ణయం ప్రపంచ మార్కెట్లకు సానుకూలాంశమే. ప్యాకేజీల కోతతో భారత్‌వంటి వర్ధమాన స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తిరోగమించొచ్చన్న భయాలకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.